
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొంది ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’కి ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించి అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా మెప్పించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో ఇంటర్నేషనల్ వర్షన్‌ను సిద్ధం చేయించారు.
పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను ప్రదర్శించడం ద్వారా వచ్చే క్రేజ్‌తో సినిమాను బిజినెస్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇప్పటికే పలు ఫెస్టివల్స్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ‘బాహుబలి’ నేటినుంచి జరగనున్న భుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అక్టోబర్ 4, 7, 9 తేదీల్లో ఓపెన్ సినిమా క్యాటగిరీలో బాహుబలి ప్రదర్శితం కానుంది. చివరి రోజు స్క్రీనింగ్‌కు దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా సినిమా యూనిట్ కూడా హాజరు కానున్నారు.

