
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ రుద్రమదేవి గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రాణీ రుద్రమదేవి లాంటి వీరవనిత చారిత్రక కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ కనిపించింది. ఇక విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి వారాంతం ఏపీ, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ కొల్లగొట్టీంది.
మొదటి వారాంతం ముగిసేసరికి అమెరికాలో ఈ సినిమా 726కే డాలర్లను వసూలు చేసి యూఎస్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. రూపాయల్లో లెక్కేస్తే ఈ సినిమా సుమారు 4.5కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్లను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్నిచోట్లా ఒకేసారి విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మరింత కలెక్షన్స్ రాబట్టే దిశగా వెళుతోంది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియో స్కీపిక్ 3డీ సినిమాగా తెరకెక్కిన ‘రుద్రమదేవి’, హిందీ, మళయాలంలోనూ తెలుగు వర్షన్‌తో పాటే విడుదలైంది.

