
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సంచలనంగా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో బాక్సాఫీస్ నెంబర్ వన్‌గా నిలబడి సత్తా చాటింది.
తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ పరంగా గతంలో ఉన్న రికార్డులన్నింటినీ ‘బాహుబలి’ సినిమా చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక టీవీ ప్రీమియర్‌లోనూ అదే స్థాయి ప్రభంజనం కొనసాగించిన ‘బాహుబలి’, రాజమౌళిని టాప్ డైరెక్టర్‌ను చేసిన ‘మగధీర’ రికార్డును మాత్రం చెరపలేకపోయింది. టీఆర్‌పీ రేటింగ్‌లో బాహుబలి సినిమాకు 21.84 రేటింగ్ సాధించినట్లు టీవీ రేటింగ్స్ ప్రకటించే అధికారిక సంస్థ టామ్ వెల్లడించింది. గతంలో ‘మగధీర’ సినిమా 22 రేటింగ్ సాధించింది. దీంతో బాహుబలికి అన్ని రికార్డులూ వశమైనా ఈ రికార్డు మాత్రం సాధ్యం కాలేదు. ఇక నాగార్జున హీరోగా నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమా 24 రేటింగ్ సాధించి తెలుగు సినిమాల్లో ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

