
‘మిణుగురులు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కథా రచయిత ఎన్. వీ. బీ చౌదరి దర్శకత్వంలో రూపొందిన మెసేజ్ ఓరియంటడ్ రివెంజ్ థ్రిల్లర్ ‘కీచక’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (అక్టోబర్ 30న) విడుదలకు సిద్ధమైంది. యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను పర్వతరెడ్డి కిషోర్ కుమార్ నిర్మించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ కొన్ని లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సన్నివేశాలు మరీ అభ్యంతరకరంగా ఉన్నాయని కొన్ని మహిళా సంఘాలు సినిమా యూనిట్‌పై నిరసన ప్రదర్శిస్తూ ర్యాలీలు చేశాయి.
ఇక ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ మహిళా సంఘాల నిరసనలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇదే విషయమై దర్శకుడు ఎన్. వీ. బీ చౌదరి మాట్లాడుతూ.. “కీచక సినిమాకు సంబంధించి లీకైన కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తిగా మెసేజ్ ఓరియంటడ్ కథాంశంతో రూపొందింది. కీచక సినిమా హార్ష్‌గా ఉంటుందే తప్ప ఎక్కడా అసభ్యంగా ఉండదు. మహిళలు వైపు నిలబడి పోరాడే సినిమా కీచక. అత్యాచారాలు చేసే వారికి ఈ సినిమా ఓ వార్నింగ్ లాంటింది. మహిళా సంఘాలు మా అభ్యర్థనను అర్థం చేసుకొని సినిమాకు సహకరించాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

