
‘అష్టా చమ్మా’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ లాంటి పలు విజయవంతమైన సినిమాలతో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, తాజాగా ‘త్రిపుర’ అనే సినిమాతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (నవంబర్ 6న) పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. తన మొదటి సినిమా జానర్ అయిన హర్రర్ కామెడీ కథాంశంతోనే దర్శకుడు రాజ్ కిరణ్ త్రిపుర సినిమాను తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా విషయంలో స్వాతి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మంచి భావోద్వేగమున్న కథాంశంతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇక హీరో ప్రధానంగా నడిచే సినిమాలతోనే విపరీతంగా ఆకట్టుకున్న స్వాతి, హీరోయిన్ ప్రధాన పాత్రలో కనిపించగా విడుదలవుతోన్న త్రిపుర ఇంకెంత బాగా ఆకట్టుకుంటారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. ఏ. చినబాబు, ఎం. రాజశేఖర్‌లు క్రేజీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర మరో ప్రధాన పాత్రలో నటించారు.

