
సామాజిక అంశాల ఇతివృత్తంతో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గంగపుత్రులు వంటి సినిమాలు తీసి టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఇప్పుడు మరో సరికొత్త కథాంశంతో చేస్తున్న సినిమా ‘గల్ఫ్’. గల్ఫ్ లో ఉండే చాలా మంది నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ‘గల్ఫ్’ అనే సినిమాను శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రబృంధం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తాజాగా రిలీజ్ చేసిన గల్ఫ్ మూవీ ప్రమోషనల్ సాంగ్ ను రెండున్నర లక్షల మంది వీక్షించారు. ఈ సినిమా కథ కోసం నాలుగు దేశాలు తిరిగి, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి జీవితాల గురించి తెలుసుకున్నాను. ప్రస్తుతం ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. డిసెంబర్ నుంచి రెండో షెడ్యూల్ మొదలుపెట్టి.. దుబాయ్, ఉమాన్, సిరిసిల్ల, కడప తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించి ఫిబ్రవరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం. ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీలో మొత్తం నాలుగు పాటలు ఉండగా, సినిమా ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో రన్ అవుతూ ఉంటుందని’ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత రవీంద్రబాబు, వలస కార్మిక సంఘం అధ్యక్షుడు భీమ్ రెడ్డి, దుబాయ్ లో లాయర్ గా పనిచేసే అనురాధా, బసంత్ రెడ్డి, ఎల్.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు. ఇక నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ ‘గల్ఫ్’ సినిమాకు ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

