ఇంటర్వ్యూ : సయేషా – ‘అఖిల్’తో పరిచయం కానుండడం నా అదృష్టం!

ఇంటర్వ్యూ : సయేషా – ‘అఖిల్’తో పరిచయం కానుండడం నా అదృష్టం!

Published on Nov 10, 2015 7:03 PM IST

Sayesha
అఖిల్ సినిమాతో తెలుగు పరిశ్రమకు అక్కినేని వంశం నుంచి అఖిల్ అక్కినేని అనే హీరో పరిచయం కానుండడం ఒక విశేషం కాగా, ఇదే సినిమాతో సయేషా పేరుతో మరో స్టార్ వారసురాలు కూడా పరిచయం కానుండడం మరో విశేషం. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సయేషా, అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా రేపు (నవంబర్ 11న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సయేషాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘అఖిల్’.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ సినిమా. ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవ్వడం ఎలా ఉంది?

స) అది కచ్చితంగా నా అదృష్టమనే చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న అఖిల్ సినిమాతో నేనూ ఎంట్రీ ఇవ్వడం అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇంతకంటే గ్రాండ్ ఎంట్రీని నేనైతే ఊహించలేను. ఆ క్రేజ్‌కి తగ్గట్టే సినిమా కూడా అందరినీ ఆకట్టుకొని మాకు ఓ మంచి హిట్ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా.

ప్రశ్న) దిలీప్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తూ.. బాలీవుడ్‌లో కాకుండా టాలీవుడ్‌లో మొదటి సినిమాను సిద్ధం చేశారేం?

స) చెప్పాలంటే ఇదేమీ ప్లాన్ చేసింది కాదు. నేను బాలీవుడ్‌లోనే ‘శివాయ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి. అనుకోకుండా ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ చాలా సమయం తీసుకోవడం, ఈ మధ్యలో వినాయక్ గారు అఖిల్ సినిమా కోసం సంప్రదించడం.. అంతా ప్లాన్ చేయకుండానే జరిగిపోయింది. ఏదేమైనా నేను ఊహించినదానికంటే పెద్ద డెబ్యూట్‌గా అఖిల్ నిలిచింది. ఆ విషయంలో ఇంతకన్నా నేను కోరేదేమీ ఉండదు.

ప్రశ్న) అఖిల్ సినిమా ఎలా ఉండబోతోంది? ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) అఖిల్ ఒక ఫుల్ ఆన్ మాస్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఒక ఎంటర్‌టైనింగ్ సినిమాలో ఏమేం కోరుకుంటారో ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నేను దివ్య అనే ఓ కాలేజీ అమ్మాయిగా కనిపిస్తా. ఒక పద్ధతి గల కుటుంబంలో పెరిగిన ఇన్నోసెంట్ అమ్మాయిగా ఈ సినిమాలో నటించా. నా నిజ జీవితానికీ కాస్త దగ్గరగా ఉండే పాత్ర.

ప్రశ్న) మీతో పాటే గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న అఖిల్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

) అఖిల్ చాలా డెడికేషన్ ఉన్న నటుడు. సెట్లో అందరితోనూ సరదాగా ఉండేవాడు. డ్యాన్సుల విషయంలో అఖిల్ హార్డ్ వర్క్ చూస్తే నాకూ కొత్త ఎనర్జీ వచ్చేది. ఒక స్టార్‌గా నిలదొక్కుకోడానికి కావాల్సిన లక్షణాలన్నీ అఖిల్ దగ్గర ఉన్నాయి.

ప్రశ్న) దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్‌ల సపోర్ట్ ఎలా ఉండేది?

స) నాకు తెలియని ప్రాంతంలో, భాషలో నటిస్తున్నానా అనే ఫీలింగ్ నాకెప్పుడూ రాకుండా దర్శకుడు వీవీ వినాయక్ గారు, నితిన్ మంచి సపోర్ట్ ఇచ్చారు. నితిన్ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ అయితే నన్ను తమ ఇంటి వ్యక్తిలా చూసుకున్నారు. ఇక నా మొదటి సినిమాకే వీవీ వినాయక్ లాంటి దర్శకుడితో పనిచేయడం నా అదృష్టం. వినాయక్ గారు మంచి నటులు కూడా. ఏ సన్నివేశం ఎలా రావాలో ఆయనే చేసి చూపించేవారు. సో, నేనైతే చాలా కంఫర్టబుల్‌గా, ఏ ఇబ్బందీ లేకుండా ఈ సినిమా చేసేశా.

ప్రశ్న) సినిమాల్లోకి రావడానికి ముందు ఏదైనా యాక్టింగ్ కోర్స్ చేశారా?

స) ఫార్మల్ యాక్టింగ్ కోర్సంటూ ఏదీ చేయలేదు. కాకపోతే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ ఒకరి దగ్గర్నుంచి యాక్టింగ్ మెళకువలు నేర్చుకున్నా. ఇక కొన్ని వెస్ట్రన్, ఇండియన్ డ్యాన్సుల్లోనూ చిన్నపాటి ట్రైనింగ్ తీసుకున్నా.

ప్రశ్న) ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు?

స) హిందీలో శివాయ్ అనే సినిమా చేస్తున్నా. ఈ నెల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. అజయ్ దేవ్‌గన్ దర్శకత్వంలో ఆయనే హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నా. అఖిల్ నా తెలుగు డెబ్యూట్ అయితే, శివాయ్ నా బాలీవుడ్ డెబ్యూట్!

ప్రశ్న) టాలీవుడ్, బాలీవుడ్ ఇలా రెండు పరిశ్రమల్లోనూ గ్రాండ్ ఎంట్రీయే లభిస్తోంది. ఫ్యూచర్‌లో ఎక్కడ కంటిన్యూ అవుతారు?

స) రెండు భాషల్లోనూ కొనసాగుతా. నాకిప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ రెండూ ఒకటే. కాబట్టి ఈ భాషలోనే సినిమాలు చేయాలని అస్సలు అనుకోవట్లేదు.

ప్రశ్న) తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తోంది?

స) అద్భుతమైన సపోర్ట్ ఉంది. నాకు తెలియని భాషలో, తెలియని ప్రాంతంలో ఇలా మీ ముందు ఇంత పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నానంటే అది ఇక్కడి ఇండస్ట్రీ ఇచ్చిన సపోర్ట్ వల్లే! ప్రేక్షకులు కూడా మొదట్నుంచీ ఎంతో ఆదరిస్తూ వస్తున్నారు. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలన్న ఆలోచనతోనే తెలుగు కూడా నేర్చుకుంటున్నా. మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా అందరు హీరోలతో నటించాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు