వర్మపై సీరియస్ అయిన బోనీ కపూర్!

వర్మపై సీరియస్ అయిన బోనీ కపూర్!

Published on Dec 2, 2015 3:16 PM IST

ram-gopal-varma-bony
ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ, ఈమధ్యే విడుదలైన తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’తో మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయారు. తనను ఎంతో ఉత్తేజానికి లోను చేసిన సంఘటనలు, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ వర్మ రాసిన ఈ పుస్తకం కొద్దిరోజుల క్రితం మార్కెట్లోకి విడుదలైంది.

ఇక ఈ పుస్తకంలో వర్మ ప్రముఖ నటి శ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ ఆమెకు ఓ ప్రేమలేఖ కూడా రాశారు. మార్కెట్లోకి ఈ పుస్తకం విడుదలైన వెంటనే శ్రీదేవిపై రాసిన వ్యాసంపై వివాదం ప్రారంభమైంది. శ్రీదేవి అందాన్ని ప్రస్తావిస్తూ వర్మ.. ఆమె గొప్ప అందగత్తె అని, మంచి నటి అని పొగుడుతూ, శ్రీదేవి తొడల గురించి మాట్లాడారు. శ్రీదేవి గురించి ఇలాంటి ప్రస్తావన తేవడంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ వర్మపై సీరియస్ అయ్యారు. అతడికి మర్యాద తెలియదని, అతడి ఆలోచనా విధానం పూర్తి పర్వర్టెడ్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

కాగా బోనీ వ్యాఖ్యలపై స్పందిస్తూ వర్మ వరుసగా కొన్ని ట్వీట్స్ చేయడం ఆసక్తికరంగా కనిపించింది. “ఒక భర్తగా శ్రీదేవికి బోనీ కపూర్ గౌరవం కన్నా, ఒక అభిమానిగా నేనిచ్చే గౌరవమే గొప్పది. బోనీ కపూర్ నన్ను విమర్శించే ముందు నేను రాసిన వ్యాసం పూర్తిగా చదివి మాట్లాడాలి. శ్రీదేవి నటనను, అందాన్ని, ఆమె మంచితనాన్ని, బోనీకపూర్‌పై చూపే ప్రేను నేను ఎప్పటికీ గౌరవిస్తాను” అని సమాధానం ఇచ్చారు. ఇక వర్మ చేసిన ఈ పనిని బోనీ కపూర్ ఓ పబ్లిసిటీ స్టంట్‌గా వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు