
విలక్షణ కథాంశాలతో దూసుకుపోతూ ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, తుంటరి, వీరుడు, కథలో రాజకుమారి, జ్యో అచ్యుతానంద, రాజా చెయ్యి వేస్తే ఇలా ఇన్ని సినిమాలను వేటికవే డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ వెళుతోన్న ఈ హీరో చేస్తోన్న సినిమాల్లో ‘రాజా చెయ్యివేస్తే’ సినిమా ఈమధ్యే ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా ప్రదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఇషా తల్వార్‌ను ఎంపిక చేశారు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో తెలుగులో పాపులర్ అయిన ఈ హీరోయిన్, ఆ తర్వాత మళయాలంలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఇషా చేసిన పలు మళయాల సినిమాల్లోని ఆమె నటనను మెచ్చి ప్రదీప్ రాజా చెయ్యివేస్తే సినిమాకు సంప్రదించగా, ఇషా వెంటనే ఈ ఆఫర్‌కు ఓకే చెప్పేశారట. ఇక ఇదే బ్యానర్‌లో నారా రోహిత్ జ్యో అచ్యుతానంద అనే సినిమా చేయనున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

