ఇళయరాజా సలహాతో తమిళంలోకి నాగశౌర్య సినిమా!

ఇళయరాజా సలహాతో తమిళంలోకి నాగశౌర్య సినిమా!

Published on Dec 9, 2015 8:27 PM IST

abbai-tho-ammayi
తెలుగు సినీ పరిశ్రమకు ఈమధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన యువహీరోల్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ శౌర్య. ఇక తన గత చిత్రమైన ‘జాదూగాడు’తో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను ట్రై చేసిన ఈ హీరో, ప్రస్తుతం రెండు వరుస సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘అబ్బాయితో అమ్మాయి’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానుంది.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన ఆడియో ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇళయరాజా కెరీర్లో 999వ సినిమాగా ‘అబ్బాయితో అమ్మాయి’ నిలవనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇళయరాజా ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయడం ద్వారా బాగుంటుందన్న సలహాను అబ్బాయితో అమ్మాయి టీమ్ ముందు ఉంచారట. దీంతో ప్రస్తుతం టీమ్ తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నాగ శౌర్య సరసన బాలీవుడ్ భామ పాలక్ లల్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జక్కం వందనా అలేఖ్య నిర్మించారు.

తాజా వార్తలు