
ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తూ మెప్పించే స్టార్స్‌లో నాగార్జున చాలా ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలూ షూటింగ్ చివరిదశకు చేరుకున్నాయి. ఇక సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసినవారంతా నాగార్జున ఫుల్ ఫామ్‌తో ఆకట్టుకొనే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠిలతో నాగార్జున కెమిస్ట్రీ, డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. హలో బ్రదర్ ఫ్లేవర్ మళ్ళీ తిరిగి కనిపించిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
దీంతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మరోసారి క్రేజ్ తెచ్చుకొని మళ్ళీ కొత్త అంచనాలకు తెరలేపింది. ఈ సంక్రాంతికి రానున్న ఈ సినిమా, పండగ సమయంలో ప్రేక్షకులు కోరుకునే ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకే సిద్ధమైందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

