
‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ మెల్లగా వేగం పుంజుకుంటోంది. కోవిడ్ లాక్ డౌన్ అనంతరం ప్రారంభమైన చిత్రీకరణ మొదట్లో కాస్త నిదానంగానే సాగిన ఇప్పుడు స్పీడ్ అందుకుంది. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇతర ముఖ్య తారాగణం డేట్లు పక్కాగా కుదరండంతో రాజమౌళి చక చకా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి దుబాయ్ హాలీడేకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కూడ ట్రిప్ ముగించుకుని ఈరోజే హైదరాబాద్ తిరిగొచ్చారు. రేపు గురువారం నుండి ఆయన షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక హీరో రామ్ చరణ్ హైదరాబద్లోనే ఉన్నారు.
మరోవైపు రాజమౌళి అండ్ టీమ్ గ్యాప్ లేకుండా రాత్రి సమయంలో కూడ షూటింగ్ చేసేస్తున్నారు. వణికించే చలిలో యాక్షన్ సన్నివేశాలను కూడ షూట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నాటికి సినిమాను పూర్తిచేయాలని చూస్తున్నారు. మార్చికు షూటింగ్ ముగిస్తే ద్వితీయార్థం ఆరంభంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సుమారు 400 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు.

