అందరి ‘రాజు’ బిఏ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అందరి ‘రాజు’ బిఏ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Jan 6, 2021 5:00 PM IST

ba raju

తెలుగు చిత్ర సీమలో నటులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా రికార్డులు సృష్టించిన, స్టార్లుగా పేరు పొందిన వ్యక్తులు చాలామందినే చూశాం. కానీ పిఆర్వోగా తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తులు కొద్దిమందే ఉంటారు. అలాంటి అతికొద్దిమందిలో బిఏ రాజుగారు ప్రముఖుడు. తెలుగు సినిమా మీడియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయంగా పలకరించే రాజుగారే. ఏదో ఉద్యోగం అన్నట్టు కాకుండా ఎంతో ప్రేమతో, ఇష్టంతో ప్రచార బాధ్యతలు నిర్వరిస్తారు రాజుగారు. అందుకే సూపర్ హిట్ అనే సినిమా పత్రికను మూడున్నర దశాబ్దాల క్రితం నెలకొల్పి లాభ నష్టాల జోక్యం లేకుండా ఇప్పటికీ విజయవంతంగా నడపగలుగుతున్నారు. అంత గొప్పది సినిమా పట్ల ఆయన కమిట్మెంట్.

ఆంధ్రభూమి పత్రికలో జర్నలిస్టుగా మొదలైన ఆయన పయనం సినీ రంగంవైపుకు టర్న్ తీసుకుని పిఆర్వోగా 1500లకు పైగా సినిమాలు చేసి ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఇండస్ట్రీలో ఆయన మూడు తరాలను చూశారు. అయినా ఆయన ఆలోచనలు, నడవడిక పాతబడలేదు. ఎప్పటికప్పుడు కొత్తదనం ఆపాదించుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నారు. డిజిటల్ మీడియా హవా లేని రోజుల్లో ప్రింట్ మీడియా ద్వారానే రాజుగారు అనేక ప్రయోగాలు చేశారు. అవే నిర్మాతలు, హీరోలు, దర్శకుల దగ్గర ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. పత్రికలు ప్రాభల్యం తగ్గి సోషల్ మీడియా యుగం వచ్చినా రాజుగారు ఇప్పటికీ చెదరని కోటలా నిలబడగలిగారు అంటే అది ఆయన పనితనంలోని మన్నిక.

రాజుగారికి సూపర్ స్టార్ కృష్ణగారంటే అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే కృష్ణగారికి దగ్గరయ్యారు. కొద్దిరోజుల్లోనే ఆప్తుడైపోయారు. రాజుగారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి నుండి కృష్ణగారి సినిమాలన్నింటికీ ఆయనే పీఆర్వో. కృష్ణగారు సినిమాకు సంబంధించి ఏ విషయంలో కంగారుపడినా ప్రమోషన్ల విషయంలో మాత్రం నిబ్బరంగా ఉండేవారట. ఎందుకంటే బిఏ రాజు ఉన్నాడనే ధీమా. అంతలా కృష్ణగారి నమ్మకాన్ని చూరగొన్నారు రాజుగారు. అందుకే కృష్ణగారి తర్వాత ఆయన కుమారుడు మహేష్ బాబు కూడ తన పీఆర్ బాధ్యతలను రాజుగారి చేతుల్లో పెట్టేశారు. అక్కడా రాజుగారు సూపర్ సక్సెస్ అయ్యారు. ఘట్టమనేని కుటుంబంతో పాటు దగ్గుబాటి, అక్కినేని సినిమాలకు కూడ రాజుగారే మొదటి ప్రాధాన్యం.

అలా పిఆర్వోగా శిఖరాగ్రానికి చేరుకొని ఇంస్ట్రీలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న రాజుగారు నిర్మాతగా కూడ విజయవంతమయ్యారు. చంటిగాడు, ప్రేమికులు, లవ్లీ లాంటి మంచి సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. రాజుగారు నిర్మించిన సినిమాలకు ఆయన సతీమణి బిఏ జయగారే దర్శకురాలు. ఆమె దర్శకత్వ శాఖలోకి రావడం, విజయవంతం కావడం వెనుక రాజుగారి ప్రోత్సాహం గొప్పది. అందుకే దర్శకత్వం వైపు కుమారుడు శివకుమార్ కు ఉన్న ఇష్టాన్ని గమనించి ఆ దిశగా నడిపిస్తున్నారు. రూపేష్ కుమార్ హీరోగా రూపొందుతున్న ’22’ అనే సినిమాతో శివ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. సినీ రంగంలో ఇన్ని రకాలుగా ప్రతిభను చాటుకుని అందరికీ ఆప్తుడైపోయిన నవ్వుల రాజు, అందరి రాజు బిఏ రాజుగారు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు ఆయన పీఆర్వోగా, నిర్మాతగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు