ఓ సినిమా తీయాలంటే వందల మంది పని చేయాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అన్నిటికీ మించి అద్భుతమైన కథాకథనాలు ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీతో సాధ్యం అయితే ?, నిజంగానే అది సాధ్యం అయింది. టెక్నాలజీ రంగంలో రోజుకొక వినూత్న మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధస్సు(ఏఐ)తో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమానే ‘నైషా’.
‘నైషా’ – భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఫిల్మ్. కాగా నైషా సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ పోస్ట్ షేర్ చేశారు. 2025 మే నెలలో ఈ సినిమా విడుదల కాబోతుందని, పైగా ‘నైషా – భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ చిత్రం అని, నైషాబోస్ మరియు జైన్ కపూర్ రూపంలో వర్చువల్ స్టార్‌లను పరిచయం చేస్తుంది నైషా చిత్రం’ అంటూ ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి.
అన్నట్టు, ఈ నైషా సినిమాకి దర్శకత్వం వివేక్ అంచాలియా వ్యవహరించారు. అదేవిధంగా పోరిభుయాన్, శ్వేతాశర్మ అంచాలియా మరియు జోసెఫ్ ఫ్రాంక్లిన్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రజాదరణతో రానున్న ఈ ఏఐ ఫిల్మ్ ఎలా ఉంటుందో చూడాలి.


