“వైభవం” సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న విజయ స్పందన తమ జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని హీరో రుత్విక్, దర్శకుడు సాత్విక్ అన్నారు. ఈ సినిమాతో సాత్విక్ దర్శకుడిగా, రుత్విక్ హీరోగా పరిచయం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చదువులో ముందున్న ఈ సోదరుల్లో తమ్ముడు సాత్విక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా, అన్నయ్య రుత్విక్ హీరోగా నటించడం విశేషం. తల్లి రమాదేవి నిర్మాతగా, రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వైభవం” ఈ నెల 23న విడుదలైంది.
భావోద్వేగాలు, మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రానికి లభిస్తున్న విజయానికి ఈ సోదరులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, గత రెండేళ్లుగా వారు చేసిన కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసిందని తెలిపారు. ఈ చిత్రం విజయానికి తోడ్పడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా రుత్విక్, సాత్విక్ కృతజ్ఞతలు తెలిపారు.


