ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజా రెడ్డి నిర్మాతగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై, సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ దర్శకత్వంలో “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో ఘనంగా జరిగింది.
ఈ చిత్రంతో పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతుండగా, సుహాన, మేఘశ్రీ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు సుమన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత వి. విజయేంద్రప్రసాద్ క్లాప్ కొట్టగా, సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమానికి రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శోభారాణి, జె.కె. భారవి తదితరులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. శ్రీలక్ష్మి శైలజ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎల్.ఎన్.ఆర్, జి. సాయిపద్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.


