ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “మిరాకిల్” సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, ఆకాంక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రల్లో కనిపిస్తుండటం విశేషం. గతంలో “సత్య గ్యాంగ్”, “ఫైటర్ శివ” వంటి చిత్రాలను రూపొందించిన ప్రభాస్ నిమ్మల ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో నరేష్ నాయుడు, జనార్దన్, విజయ్ సూర్య, ఇంతియాజ్, ఆమని సహా భారీ తారాగణం నటిస్తోంది. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదలతో ప్రమోషన్ల వేగం పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.


