పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ సినిమా దగ్గర కూడా సత్తా చాటి అవకాశాలు సొంతం చేసుకున్న భారతీయ నటులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇక ఇందులో కూడా తెలుగు నుంచి ఉన్న నటులు అయితే మరింత తక్కువ కానీ అలాంటి అరుదైన నటుల్లో నటి శోభిత ధూళిపాళ కూడా ఒకరు. మరి శోభిత, వరల్డ్ సినిమాతో పాటుగా ఓటిటిలో కూడా పలు ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ లు చేయడం జరిగింది.
ఇలా శోభిత నుంచి వస్తున్న లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ నే ‘చీకటిలో’. పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఈ జనవరి 23న తెలుగు, హిందీ, తమిళ్ లో స్ట్రీమింగ్ కి రానుంది. మన తెలుగు నుంచి ఇది ఆమెకి డెబ్యూ కాగా ఈ సినిమా రిలీజ్ కి వస్తున్న నేపథ్యంలో శోభిత సహా నటుడు విశ్వదేవ్ రాచకొండ, దర్శకుడు శరన్ కొప్పిశెట్టి ప్రత్యేకంగా మా ‘123తెలుగు’తో ఈ సినిమా నేపథ్యం పాడ్ కాస్ట్ స్టైల్ లోనే ముచ్చటించడం జరిగింది. మరి వీరు ఈ సినిమా పరంగా ఎలాంటి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారో ఒక లుక్కేద్దాం రండి.
‘చీకటిలో’కి మీరు ఎంటర్ కావడానికి బలమైన కారణం ఏంటి?
శోభిత:
ఈ ‘చీకటిలో’ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి మొదటి కారణాల్లో ఇందులో నేను చేసిన రోల్ సంధ్య. ఆమె చాలా ధైర్యవంతురాలు, మంచి లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంతలో కూడా ఆమె చాలా సాధారణంగా నడుచుకుంటుంది. దీనితో పాటుగా పాడ్ కాస్ట్ యాంగిల్ ఇంకా కథని చెప్పే విధానం రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఇది కూడా నేను ఒప్పుకోవడానికి మరో కారణం. అంతే కాకుండా ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొడక్షన్, గతంలో మేడిన్ హెవెన్ అనే సిరీస్ కూడా చేశాను. చీకటిలో కథ వీరి దగ్గరకి వచ్చినప్పుడు సంధ్య పాత్ర కోసం నన్ను అనుకున్నట్టు తెలిపారు. నేను కూడా తెలుగులో ఒక సినిమా చేసి చాలా కాలం అయ్యింది. సో అలా అన్నీ కలిపి ఈ సినిమా చేయడానికి కారణం అయ్యాయి.
విశ్వదేవ్:
నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు, ఇది క్రైమ్ జానర్‌లోకి అడుగుపెడుతున్న ఒక రియలిస్టిక్ డ్రామాలా అనిపించింది. క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో ఇంతటి ఎమోషన్ ఉండటం నాకు కొత్త. ఇది ‘సఖి’ లాంటి ఎమోషనల్ సినిమాను క్రైమ్‌తో కలిపినట్టుగా అనిపించింది, ఆ కాంబినేషన్ నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది.
దీనితో పాటుగా మరో ముఖ్యమైన కారణం మా టీమ్. దర్శకుడు శరణ్ మరియు నిర్మాత సురేష్ గారు నాకు పనిని చాలా సులభం చేశారు.
మరి సంధ్య రోల్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
శోభిత:
ఈ చిత్రానికి ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం డిఫరెంట్. నా రోల్ కి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక రకమైన అధికారాన్ని చూపిస్తూ దానిని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో దానిని నాచురల్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి అనే దానిపైనే ఎక్కువగా ఆలోచిస్తూ నేను సమయం గడిపేదాన్ని. అలా ఒక్కసారి క్లారిటీ వచ్చాక మిగతా అన్ని పనులు ఈజీ అయిపోయాయి.
రానా దగ్గుబాటితో ప్రయాణం ఒక నటుడుగా మీ ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపించింది?
విశ్వదేవ్:
నాకు నిర్మాత సురేష్ బాబు గారి సపోర్ట్ అపారమైనది. సినీ ప్రయాణంలో సురేష్ బాబు గారు, రానా దగ్గుబాటి ఇద్దరికీ కీలక పాత్రలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరితో ప్రయాణం వారితో భిన్నంగా సాగింది. 35 చిన్న కథ కాదు, పరేషాన్, డబుల్ ఇంజిన్, డార్క్ చాకోలెట్, లాంటి సినిమాలకి రానా గారి ప్రమేయం ఉంది. నిజాయితీని తాను పసిగడతారు. ఆ లక్షణం తనలో ఉంది కాబట్టే నా సినిమాలకి అండగా నిలబడ్డారు.
ఈ మధ్యలో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, వాటికి భిన్నంగా ‘చీకటిలో’ కొత్తగా ఏం ప్రామిస్ చేస్తుంది?
శరన్ కొప్పిశెట్టి:
‘చీకటిలో’ సినిమాలో ఇప్పుడు వరకు పెద్దగా ఎవరూ టచ్ చెయ్యని అండర్ లైన్ ఆలోచనతో కూడిన భిన్నమైన టచ్ ఉంటుంది. అలా అని ఇది పూర్తిగా క్రైమ్ కథ కూడా కాదు, మెసేజ్ కూడా ఉండదు. మన కుటుంబాల్లో, ఇరుగుపొరుగు బయట మనం పెద్దగా పట్టించుకోని సమస్యలు, అవి మనకి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ అవే తర్వాత పెద్దగా ప్రభావాన్ని చూపిస్తాయి. అదే ఈ సినిమాలో మెయిన్ అంశం.
అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సీన్ ఉంటుంది. దానికి ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాయని భావిస్తున్నాను. మనం నిజం కంటే కూడా సమాజం ఏమనుకుంటుందో అనే ఎక్కువగా భయపడుతుంటాం. ఒక బిడ్డ తనకి జరిగిన ఏదైనా ఇబ్బందికరమైన విషయం గురించి చెప్పినప్పుడు, మనం అది విని పరిష్కరించే బదులు నిర్లక్ష్యం చేస్తుంటాం. ఒక అమ్మాయి అలాంటి చీకటిని (సమస్యను) ఎలా అధిగమించింది అనేదే ఈ సినిమా చెబుతుంది.
ఈ ప్రాజెక్ట్ లోకి శోభిత గారు వచ్చాక ఏమన్నా మార్పులు, చేర్పులు జరిగాయా?
శరన్ కొప్పిశెట్టి:
అలా ఏం చెయ్యలేదు. అన్నీ కథ ప్రకారమే అనుకున్నట్టే డిజైన్ చేసాం. నటీనటుల డైలాగులు ఒకే పద్దతిలో చెప్పండి అని బలవంతపెట్టే దర్శకుణ్ణి అయితే నేను కాను. వారి బాడీ లాంగ్వేజ్, వారి నటన ద్వారా ఎమోషన్స్ ని నాచురల్ గా పండించడానికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని నేను భావిస్తాను.
శోభిత:
శరన్ చాలా సపోర్టివ్. నేను చెప్పిందే చెయ్యాలి అనే మొండి పట్టు ఉన్న దర్శకుడైతే తాను కాదు. ఆర్టిస్ట్ లని తాను గౌరవిస్తారు. నాచురల్ గా పెర్ఫామ్ చేయడానికి మాకు స్కోప్ ఇస్తారు.
35 లాంటి ఫ్యామిలీ మ్యాన్ లాంటి సినిమా తర్వాత ‘చీకటిలో’ లాంటి క్రైమ్ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు?
విశ్వదేవ్:
ఈ రెండు సినిమాల పాత్రల మధ్య కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. ’35’లో నా పాత్ర తన భాగస్వామిని (భార్యను) ఎంతో గౌరవిస్తుంది. ఇక ‘చీకటిలో’ విషయానికి వస్తే, నా పాత్ర ఆమె సమయం కోసం, ఆమె ఇచ్చే ఎమోషనల్ స్పేస్ కోసం పరితపిస్తుంది. కానీ ఆమె మాత్రం చాలా సీరియస్ వ్యవహారంలో (కేసులో) నిమగ్నమై ఉంటుంది. ఈ రెండు సినిమాల్లోని భావోద్వేగాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఆ సున్నితత్వం మాత్రం అలాగే ఉంటుంది.
శోభిత:
ఈ సినిమాలో చూపించిన రిలేషన్ షిప్ యాంగిల్ నాకు బాగా నచ్చింది. నిజ జీవితంలో ఏ ఇద్దరు భాగస్వాములూ ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉండరు. వారి మధ్య విభేదాలు, గొడవలు సహజం. అలాంటి రియాలిటీని ‘చీకటిలో’ చిత్రంలోని మా పాత్రల ద్వారా కనిపించేలా ప్రెజెంట్ చేశారు.
పాడ్ కాస్ట్ కల్చర్ అనేది తెలుగు ఆడియెన్స్ కి ఇప్పటికీ ఒక కొత్త అంశమే. ఈ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ‘చీకటిలో’ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా?
శోభిత:
పాడ్ కాస్ట్ కల్చర్ మన దేశంలో మెల్లగా పెరుగుతూ వెళ్తుంది. సినిమాల్లో ఎలాగైతే కొన్ని జానర్స్ ఉంటాయో అలానే పాడ్ కాస్ట్ లో కూడా ఉన్నాయి. వీటిలో క్రైమ్ పాడ్ కాస్ట్ లకి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. మన దగ్గర కూడా. సో ఇది కూడా అలానే రైజ్ అవుతుంది.
శరన్ కొప్పిశెట్టి:
ఏ కొత్త కాన్సెప్ట్ ని అయినా చూసే ప్రేక్షకునికి సింపుల్ గా అర్ధం అయ్యేలా వారిని ఎంగేజ్ చేసేలా చూపిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఆదిత్య 369 లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. నిజానికి అది ఒక క్లిష్టమైన ఐడియా. అయినప్పటికీ సింగీతం శ్రీనివాసరావు గారు ఆడియెన్స్ కి అర్ధమయ్యేలా వివరించారు. అలానే మా అప్రోచ్ కూడా ఉంటుంది.
విశ్వదేవ్:
ప్రస్తుతం షార్ట్ ఫామ్ లో ఉన్నటువంటి కంటెంట్ అంటే రీల్స్ లాంటివి అందరి అటెన్షన్ ని అందుకుంటున్నాయి. కానీ లాంగ్ ఫార్మాట్ పాడ్ కాస్ట్ లకి కూడా గట్టి రెస్పాన్స్ ఉంది.
ఫైనల్ గా ‘చీకటిలో’ తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
శోభిత:
నేను తెలుగులో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ‘చీకటిలో’తో మళ్ళీ వస్తున్నాను. నా రోల్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కాకుండా పా రంజిత్ తో ‘వెట్టువం’కి వర్క్ చేస్తున్నాను. ఇది పూర్తిగా డిఫరెంట్ అలాగే విజువల్స్, అందులో పాత్రలు స్టోరీ టెల్లింగ్ నిజంగా నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది.
విశ్వదేవ్:
చీకటిలో తర్వాత డార్క్ చాకోలెట్ నా నుంచి రాబోతుంది. రీసెంట్ గానే కొంతమంది సెలెక్టెడ్ ఆడియెన్స్ కి టెస్ట్ స్క్రీనింగ్ కూడా వేసాము. వారి ఫీడ్ బ్యాక్ పై ప్రస్తుతం పని చేస్తున్నాం. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా ప్రౌడ్ గా కూడా ఉన్నాను.
శరన్ కొప్పిశెట్టి:
నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘అధీరా’. కళ్యాణ్ దాసరి గారితో చేస్తున్నాను. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ‘అధీరా’కి డైరెక్ట్ చేస్తున్నాను. దీని షూట్ ఈ జనవరి 27 నుంచి మొదలు అవుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని డీటెయిల్స్ అందిస్తాము.


