టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీనాథ్ మాగంటి మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో అభిలాష్‌గా, ‘లక్కీ భాస్కర్’లో సూరజ్‌గా, అలాగే బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’లో రష్మిక సోదరుడిగా ఆయన తన నటనతో మెప్పించారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న కల్ట్ క్లాసిక్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (Ee Nagaraniki Emaindi 2) లో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోల్లో ఆయన ఒకరిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మొదటి భాగం మాదిరిగానే, ఈ సినిమా కూడా నిజ జీవిత సంఘటనలు, స్నేహం నేపథ్యంలోనే తెరకెక్కనుంది. అయితే, తొలి భాగంలో కార్తీక్ పాత్ర పోషించిన సుశాంత్ ఈ సీక్వెల్‌లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర ప్రయాణం కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీంతో ఆ ఆసక్తికరమైన పాత్రను శ్రీనాథ్ మాగంటి పోషిస్తున్నారా అనే చర్చ మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


