రిషబ్ శెట్టి కండీషన్స్‌తో టాలీవుడ్ నిర్మాతలు అసంతృప్తి..?

రిషబ్ శెట్టి కండీషన్స్‌తో టాలీవుడ్ నిర్మాతలు అసంతృప్తి..?

Published on Feb 1, 2026 8:00 AM IST

Rishab Shetty

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాల భారీ విజయంతో ఆయన క్రేజ్ ఆకాశాన్ని తాకగా, ప్రస్తుతం రిషబ్ శెట్టి తెలుగులో రెండు భారీ ప్రాజెక్టులకు సంతకం చేశారు. అయితే, ఈ సినిమాల కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సాధారణంగా లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిలో పనిచేయమని నిర్మాతలు కోరినప్పటికీ, రిషబ్ శెట్టి మాత్రం ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో నటించనున్నారు. దీనితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామాలో కూడా రిషబ్ భాగం కానున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కేవలం ఈ రెండు ప్రాజెక్టులపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న రిషబ్, ఇతర ఏ కొత్త సినిమాలకు డేట్స్ కేటాయించడం లేదని సమాచారం. మరి ఆయన అడుగుతున్న ఈ భారీ పారితోషికం విషయంలో నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తాజా వార్తలు