త్రివిక్రమ్ బాటలో వెంకీ.. టైటిల్స్‌తో వావ్ అనిపించేస్తున్నారుగా..!

త్రివిక్రమ్ బాటలో వెంకీ.. టైటిల్స్‌తో వావ్ అనిపించేస్తున్నారుగా..!

Published on Feb 2, 2026 7:01 PM IST

Venky Atluri,

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్స్ ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మాస్ హీరోలతో సినిమాలు తీసినా, టైటిల్ మాత్రం క్లాస్‌గా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి పేర్లను ఎంచుకుంటారు. ఇప్పుడు ఇదే బాటలో యువ దర్శకుడు వెంకీ అట్లూరి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్యతో వెంకీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు వినగానే త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.

వెంకీ అట్లూరి గత చిత్రం ‘లక్కీ భాస్కర్’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో, సూర్యతో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ‘ఫార్చ్యూన్ ఫోర్’ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ సినిమాలో సూర్య ఒక నడి వయస్కుడిగా కనిపిస్తారని, కేరళ బ్యూటీ మమిత బైజు ఇందులో కథానాయికగా నటిస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్.

చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు, ఈ ఫ్యామిలీ డ్రామా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో ‘కరుప్పు’ వంటి యాక్షన్ సినిమాలు ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి స్టైల్ లో రాబోతున్న ఈ సినిమాపైనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ ‘విశ్వనాథం అండ్ సన్స్’ టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

తాజా వార్తలు