పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఇటలీలో ఓ చిన్న వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. విరామం తర్వాత ఆయన మళ్ళీ షూటింగ్‌లతో బిజీ అయిపోయాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ తాజాగా అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో ఈ రోజు నుంచే షూటింగ్ ప్రారంభమైంది. ఆగస్టు నెల మొత్తాన్ని ప్రభాస్ ఈ సినిమాకే కేటాయించారు. ఎటువంటి విరామం లేకుండా ఈ నెల రోజులూ ఫౌజీ షూటింగ్‌లో పాల్గొని, తన భాగానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయనున్నాడు.
స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథాంశంతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా దాదాపు 50 రోజుల షూటింగ్ బాకీ ఉంది. అందులో భాగంగానే దానికి సంబంధించిన ప్లాన్ ప్రకారం, మొదట ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలన్నింటినీ చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు చిత్రబృందం ఎంతో వేగంగా పనిచేస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యత ఇస్తూ డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం జరుగుతున్న నాన్-స్టాప్ షెడ్యూల్‌తో సినిమా నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతుండటంతో, ప్రభాస్ అభిమానులు ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


