ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాను మించి మరో సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను, క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ‘పుష్ప 1 – 2’ సినిమాలతో దేశవ్యాప్తంగా అపారమైన జనాదరణ పొందిన బన్నీ, ఆ తర్వాత అట్లీతో ప్రకటించిన ‘రాకా’ ప్రాజెక్ట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రంలో ఆయన గెటప్ చూసి చిత్ర పరిశ్రమ సైతం షాక్ అయింది. ఇక తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AA23’ కోసం బన్నీ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన ఒక విభిన్నమైన మేకోవర్ సాధించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
అభిమానులను, విమర్శకులను ఆకట్టుకునేలా ఈ లుక్ డిజైన్ చేయడానికి అల్లు అర్జున్, లోకేష్ కలిసి చాలా సమయం కేటాయించినట్లు సమాచారం. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు పాత్ర ఏదైనా తన వంద శాతం శ్రమను అందించే అల్లు అర్జున్, ఈ సినిమా విషయంలోనూ అస్సలు తగ్గడం లేదు. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’ శైలిలోనే ‘AA23’లో కూడా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చని గట్టిగా వినిపిస్తోంది. ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, అది సంప్రదాయ హీరోయిన్ పాత్ర కాదని తెలుస్తోంది. పుష్ప విజయం అందించిన నేషనల్ స్టార్‌డమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, ‘రాకా’, ‘AA23’ చిత్రాలతో తన సరిహద్దులను మరింత విస్తరించుకోవడానికి బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.


