ప్రేమ , భక్తి మాత్రమే మిగులుతాయంటూ అద్భుతంగా ఆకట్టుకున్న పురాణపండ ప్రసంగం

ప్రేమ , భక్తి మాత్రమే మిగులుతాయంటూ అద్భుతంగా ఆకట్టుకున్న పురాణపండ ప్రసంగం

Published on Feb 15, 2026 1:55 AM IST

అంజి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చరిత్రాత్మకంగా ఎనభైమంది చిత్రకారులు

Puranapanda Srinivas

హైదరాబాద్ : ఫిబ్రవరి : 15

సభలూ, సమావేశాలూ చాలా జరుగుతాయ్ . కొన్ని మాత్రమే అందంగా ఒక జ్ఞాపకమై గుర్తుంటాయ్ . అలాంటి ఒక అద్భుత అనుభవం ప్రముఖ చిత్రకారుడు , అనుబంధాలకు పెద్దపీటవేసే మానవతావాది ఆకొండి అంజి పర్యవేక్షణలో ఇటీవల హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ జె.ఎన్. టీ . యూ . నెహ్రు ఆర్ట్ గేలరీ లో జరిగిన సుమారు ఎనభై పైచిలుకు చిత్రకారుల చిత్రకళాఖండాల ప్రదర్శనలో ఎంతోమందికి గుర్తుండిపోయేలా జరగడం విశేషం. ఈ ఫిబ్రవరి నెలలో ఆరు, ఏడు , ఎనిమిది తేదీలలో మూడురోజులపాటు జరిగిన ఈ ప్రదర్శన ముగింపు వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గనడంతో ఈ సభకు మరింతకళ , సరైన ఉత్తేజం వచ్చిందని పలువురు అభిప్రాయ పడ్డారు.

Puranapanda Srinivas Akondi Anji

ఒక పది సభలకు పిలిస్తే రెండో , మూడో మాత్రమే సభలకు హాజరయ్యే పురాణపండ శ్రీనివాస్ ఈ సభకు ముఖ్య అతిధిగా కేవలం ఆకొండి అంజికి తనపై అభిమానానికి, కష్టపడే అంజి మనస్తత్వానికి , ఎంతోమంది క్రొత్త చిత్రకారులను ప్రోత్సహించి ఉత్సాహపరిచే అంజి సహృదయానికి మాత్రమే ఈ సభకు వచ్చినట్లు స్పష్టమైంది. ప్రఖ్యాత చిత్ర కళాకారులు శేషబ్రహ్మం అధ్యక్షస్థానంలో ఉండి అద్భుతమైన రీతిఁలో సభను నడిపించారు. శేషబ్రహ్మం తన ప్రసంగంలో అంజి విశాలహృదయాన్ని , ఎగ్జిబిషన్ నిర్వహించిన తీరును ప్రశంసించారు.

జాతీయస్థాయిలో పేరుపొందిన విఖ్యాత చిత్రకారులు దాకోజు శివప్రసాద్ ఈ సభ మధ్య మధ్యలో చక్కని చెణుకులు, పాటలతో సభలో రసజ్ఞత్వాన్ని పెంపొందించి ఆకట్టుకున్నారు. సీనియర్ ఎన్ టీ ఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న దాకోజు శివప్రసాద్ నాల్గుతరాల్ని ప్రభావితం చేసిన ఆర్టిస్ట్ కావడంతో ఆయన సీనియారిటీకి ఈ సభలో గౌరవం చక్కగా దక్కడం మరొక విశేషమే. హనుమాన్ చాలీసా విశేష పారాయణతో ధరిస్తున్న ప్రముఖ సినీ నటులు , డిజిటల్ క్రియేటర్ సుబ్బు చంద్రగిరి , ప్రముఖ కవి, రచయిత సుబ్బు ఆర్ వి , మనస్తత్వ శాస్త్రవేత్త, ఫామిలీ కౌన్సిలర్ శ్రీమతి గుర్రం రెడ్డి, ప్రముఖ చిత్రకారులు అమీర్జాన్ భాషా ,తదితరులప్రసంగాలు చిత్రకారుల , బహుమతీ గ్రహీతల్లో ఉత్సాహాన్ని పెంచాయి.

ఈ సభలో ప్రధానంగా పేర్కొనాల్సిన వ్యక్తి పురాణపండ శ్రీనివాస్ అని సభలో పాల్గొన్న వక్తలు ఒక వైపు , వందలాది ఆడియన్స్ మరొక వైపు పురాణపండ శ్రీనివాస్ పై ప్రశంసలు వర్షించడం , శ్రీనివాస్ మాట్లాడుతున్నసేపు కన్నార్పకుండా ఆయనవైపు చూస్తూ … చప్పట్లు కొట్టడం కనిపించింది. మనుషుల్లో పేరుకుంటున్న వికృత మనస్తత్వాలపై , స్వార్ధాలపై , అసూయా ద్వేషాలపై పురాణపండ కొరడా ఝళిపిస్తూ ఆలోచనాత్మకంగా చేసిన ప్రసంగం ప్రేక్షకులచే వన్స్ మోర్ అంటూ చప్పట్లు కొట్టించింది. మూడు రోజుల ప్రదర్శన ఒక ఎత్తయితే … పురాణపండ శ్రీనివాస్ చివరి రోజు సభలో యిచ్చిన ఉత్తేజనాత్మక ప్రసంగం ఒక ఎత్తని , పురాణపండను సభకు ఆహ్వానించడం పట్ల దాకోజు శివప్రసాద్ తో పాటు ఎంతోమంది కళాకారులు ఆకొండి అంజిని సభలో అభినందించారు. కల్పనారెడ్డి అనబడే శ్రీమతి గుర్రంరెడ్డి మాట్లాడుతూ అంజి అభిమానం అనంతమని, ఎంతో కష్టపడే అంజిని అందరం ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం అవార్డు గ్రహీతలు బహుమతులిచ్చే ప్రక్రియ మొదటగా పురాణపండ నుండి అందుకోగా … తరువాత సుబ్బు ఆర్వీ , సుబ్బు చంద్రగిరి , కల్పనారెడ్డి , దాకోజు, శేషబ్రహ్మం లనుండి అందుకున్నారు.

3-Day Art Exhibition by Akondi Anji

ఒకేసారి ఒకేచోట ఎనభైమంది చిత్రకారుల్ని సమావేశపరచి , చిత్రకళాఖండాల ప్రదర్శనని మూడు రోజులపాటు హైదరాబాద్ లో నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదని , ఒక మధ్య తరగతి కుటుంబీకుడైన ఆకొండి అంజి ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి వెనుక ఆంజనేయస్వామి అనుగ్రహం పుష్కలంగా ఉందని పురాణపండ శ్రీనివాస్ అంటున్నప్పుడు ప్రేక్షకులు , కళాకారులు కరతాళధ్వనులు మారు మ్రోగించారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించిన ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజిని ప్రదర్శన ప్రారంభంలో జె . ఎన్ .టి . యూ . వైస్ ఛాన్సలర్ టి. గంగాధర్ ప్రశంసిస్తూ చిత్రకారుల ప్రదర్శనని తిలకించడం విశేషం. ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆనందరావు కూడా వందలాది చిత్రకారుల చిత్రాల్ని వీక్షించడం … ఈ మూడు రోజులూ ఎంతోమంది రసజ్ఞులు చక్కగా పాల్గొనడం ఉత్తేజాన్నిచ్చిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో … ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం , దాకోజు శివప్రసాద్ , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పట్ల అంజి చూపించిన విశేషమైన అభిమానం , ప్రేమ అడుగడుగునా దర్శనమిచ్చింది. మరొక ముఖ్యాంశంగా చెప్పాల్సివస్తే … తమ చిత్రకళాఖండాల్ని ప్రదర్శించిన చిత్రకారులు కాకినాడకు చెందిన రజని, లక్ష్మీరమ్య , కందిపల్లి రాజు, అడివివరంకు చెందిన మాధవీ బాలసుబ్రహ్మణ్యం, రామ శాస్త్రి , హైదరాబాద్ కి చెందిన రజని, గాయత్రీ కనుపర్తి, వి.సురేష్ బాబు, , కె. సుందరకుమార్ , శ్రీనివాస్ గండూరి, ఆదోనికి చెందిన ఎన్ . కీరా , వినుకొండకు చెందిన వజ్రగిరి జస్టిస్ , కామారెడ్డి కి చెందిన మందా రవీందర్ , వై .వి .ఎస్. నారాయణ, జగిత్యాలకు చెందిన అశోక్ బోగా , నూకల ప్రవీణ్ , నేహా జైన్ , గండూరి శ్రీనివాస్ తదితర ప్రముఖ చిత్రకారులు సుమారు ఎనభైమంది ఈ ప్రదర్శనలో పాల్గొనడం, వారంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చెయ్యడం కొసమెరుపుగా చెప్పక తప్పదు.

ప్రేమ , భక్తితో పాజిటివ్ థింకింగ్ తో ప్రయాణించండి … ఆరోగ్యం హాయిగా ఉంటుంది ‘ … అని పురాణపండ సభలో చెప్పిన మాటలు అందరినీ ఎక్కువ ఆకట్టుకున్నాయి. అంజి స్థాపించిన క్రియేటివ్ హార్ట్స్ చిత్ర కళా సంస్థకు ఈ మూడు రోజుల ప్రదర్శన , చివరిరోజు సభ ఒక అందమైన జ్ఞాపకంగా చెప్పక తప్పదు.

3-Day Art Exhibition by Akondi Anji

3-Day Art Exhibition by Akondi Anji

తాజా వార్తలు