సమీక్ష : హే బలవంత్ – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

సమీక్ష : హే బలవంత్ – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

Published on Feb 20, 2026 9:15 AM IST

Hey Balavanth Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 20, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సుహాస్, శివానీ నాగారం, నవరసరాయ నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్, యాంకర్ స్రవంతి చొక్కారపు, నెల్లూరు సుదర్శన్, అజయ్ ఘోష్, హర్షవర్దన్, అన్నపూర్ణమ్మ తదితరులు
దర్శకుడు : గోపి ఆచార
నిర్మాతలు: బీ నరేంద్రరెడ్డి
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : మహీ రెడ్డీ పండుగుల
కూర్పు : విప్లవ్ నైషాడ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా హే బలవంత్ (Hey Balwanth). త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి గోపి ఆచంట దర్శకత్వం వహించారు

Hey Balwanth కథ :

చిన్నప్పటి నుంచి కృష్ణ బలవంత్ (సుహాస్) తన తండ్రి రావు బలవంత్ (నరేష్) వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలని కలలు కంటూ పెరుగుతాడు. అయితే, అతని తండ్రి మాత్రం ఉద్దేశపూర్వకంగా కృష్ణని తన వ్యాపారానికి దూరంగా పెంచుతాడు. ఇంతకీ, తన తండ్రి వ్యాపారం ఏమిటో కూడా కృష్ణకి తెలియదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కృష్ణకి చివరకు నిజం తెలుస్తోంది . ఆ వ్యాపారం గురించి తెలిసి అతను షాక్ అవుతాడు. ఇంతకీ, అసలు రావు బలవంత్ వ్యాపారం ఏమిటి ?, కొన్ని ఊహించని పరిణామాలు కారణంగా కృష్ణ బలవంత్ ఆ వ్యాపారం చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది ?, ఈ మధ్యలో ఉన్న కృష్ణ లవర్ మిత్రా (శివానీ నగరం)ను ఎలా ప్రేమించాడు ?, ఎలా మేనేజ్ చేశాడు ?, అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

తన తండ్రి చేస్తున్న చెప్పుకోలేని వ్యాపారం చుట్టూ హీరో పడిన ఇబ్బందులను వినోదాత్మకంగా ఈ చిత్రంలో చూపించారు. ఈ క్రమంలో వచ్చే డ్రామా బాగుంది. ముఖ్యంగా సీనియర్ నరేశ్ తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సీన్స్ బాగున్నాయి. ఈ మధ్యలో సుహాస్ – హీరోయిన్ వైపుకు కథ టర్న్ అవ్వడం ఆకట్టుకుంది. వీటితో పాటు శివానీ నాగారం ఫ్యామిలీ డ్రామా, కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రధానంగా కామెడీ సీన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాలో భావోద్వేగాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. సుహాస్ ఈ సినిమాతో తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కూడా బాగా పలికించాడు.

ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. సుహాస్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా శివానీ నాగారం తన నటనతో అలరించింది. ఇక మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నరేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరో కీలక పాత్రలో కనిపించిన అజయ్ ఘోష్ నటన కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన సుదర్శన్, హర్షవర్ధన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సీనియర్ నరేశ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో కథనాన్ని , ఆ కథనం గమనాన్ని జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. మొత్తానికి సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది. మొత్తమ్మీద కథలో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను కూడా కరెక్ట్ గా వాడుకోలేదు.

దీంతో, సెకండ్ హాఫ్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. నిజానికి సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన ఎమోషనల్ సీన్స్ తో కథనాన్ని నడిపినా.. కొన్ని చోట్ల మాత్రమే ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. సుహాస్ – సీనియర్ నరేశ్ మధ్య డ్రామాలో ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అటు క్లైమాక్స్ లో కూడా ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు గోపి ఆచార తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత బీ నరేంద్రరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

“హే బలవంత్’’ (Hey Balwanth) అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు