మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడానికి ముందే సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలు పెట్టింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మోటివేషనల్ సాంగ్ ‘రై రై రా రా’ సౌత్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్‌గా నిలిచింది.
కేవలం తెలుగు వెర్షన్‌లోనే ఈ పాట 29.22 మిలియన్ల వ్యూస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ సొంత పాటలైన ‘చికిరి చికిరి’ (29.1 మిలియన్), ‘నానా హైరానా’ (23.45 మిలియన్) రికార్డులతో పాటు, పవన్ కళ్యాణ్ ‘దేఖ్లేంగే సాలా’ (28.53 మిలియన్), అల్లు అర్జున్ ‘కిస్సిక్’ (27.19 మిలియన్) వంటి భారీ సాంగ్స్ రికార్డులను కూడా అధిగమించింది.
అన్ని భాషలు కలిపి ఈ పాట ఏకంగా 46.1 మిలియన్ వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ‘రై రై రా రా’ పాటతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.



