రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘ట్రైసర్’ను సంచలన దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. మాస్, యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. ట్రైసర్‌ను విడుదల చేసిన హరీష్ శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవిక కథనానికి కమర్షియల్ హంగులు అద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని వెల్లడించారు.
ఈ సినిమాలో నటీనటులంతా సరికొత్త అవతారాల్లో కనిపించనున్నారు. ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండగా, యువ హీరో రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. భరత్, అమ్ము అభిరామి, కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువతలో మంచి గుర్తింపు ఉన్న స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. యాక్షన్, ఎమోషన్, సామాజిక అంశాల కలబోతగా వస్తున్న ఈ చిత్రం రెండు భాషల ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.


