ఓటీటీ స్ట్రీమింగ్ తేది : ఏప్రిల్ 16, 2026
ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక : ఆహా
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రమేష్ ఇందిరా, అచ్యుత్ కుమార్, అర్జున్ అంబటి, స్నేహల్ కామత్ తదితరులు
దర్శకుడు : రమేష్ ఇందిరా
నిర్మాత : అర్జున్ సింగంపల్లి, శరత్
చక్రవర్తి సంగీతం : ఎల్.వి. ముత్తు గణేష్
సినిమాటోగ్రఫీ : శ్రీశ కుడువల్లి
ఎడిటింగ్ : నవీన్ నజోస్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఓటిటిలోకి వచ్చిన కంటెంట్ లో మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు తీసుకొచ్చిన ఓ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” కూడా ఒకటి. మరి ఈ సిరీస్ ఓటిటి వీక్షకులని ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక మారుమూల గ్రామంలో ఫ్రెడ్రిక్ (రమేష్ ఇందిరా) ఒక విలాసవంతమైన ఎస్టేట్‌ను కొనుకుంటాడు. అయితే, ఆ భూమిలో కాలం నాటి ఒక ‘పోచమ్మ’ విగ్రహం ఉంటుంది. రఘుపతి (అచ్యుత్ కుమార్) హెచ్చరికలను లెక్కచేయకుండా, ఫ్రెడ్రిక్ ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తీయించేస్తాడు. అక్కడ నుంచి అతని జీవితంలో వింత సంఘటనలు మొదలవుతాయి. కొద్ది రోజుల్లోనే అతని చిన్న కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. అసలు ఆ చిన్నారి మరణానికి పోచమ్మ తల్లి ఆగ్రహమే కారణమా? లేక మరేదైనా భయంకరమైన నిజం దాగి ఉందా? అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సిరీస్‌కు ప్రధాన బలం ఏదన్నా ఉంది అంటే అది ప్లాన్ చేసుకున్న కథనం అని చెప్పాలి. దర్శకుడు రమేష్ ఇందిరా మొదటి నిమిషం నుండే కథను ఆసక్తికరంగా నడిపించారు. అనవసరమైన బిల్డప్ ఇవ్వకుండా నేరుగా పాయింట్‌లోకి తీసుకువెళ్లడం ఇందులో మెప్పిస్తుంది. చాలా వెబ్ సిరీస్‌లలాగా సాగదీత లేకుండా కథనం గ్రిప్పింగ్‌గా సాగుతుంది. అలానే కథలో పోచమ్మ దేవతను మరియు స్థానిక నమ్మకాలను జోడించిన విధానం బాగుంది. ఇది ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతను పెంచుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే స్నేహల్ కామత్ తన పాత్రలో ఒదిగిపోయింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అర్జున్ అంబటి మెప్పించాడు. సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ తన అనుభవంతో కథకు వెయిట్ తీసుకొచ్చారు.
అలానే ఈ తరహా సిరీస్ లకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం. ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్‌కు ఈ వర్క్ మరో ప్రధాన హైలైట్ గా నిలిచింది. సీన్లలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేయడంలో సంగీత దర్శకుని పనితనం మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సిరీస్ కేవలం ఐదు ఎపిసోడ్లే ఉన్నప్పటికీ, కథనం పరంగా ఇది కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. ఒక ఆస్కార్ విన్నింగ్ సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. స్థానిక నేటివిటీ కోసం భక్తి అంశాన్ని జోడించినప్పటికీ, క్లైమాక్స్ ట్విస్ట్‌ను ముందే ఊహించేయవచ్చు.
అంతే కాకుండా ఇది తెలుగు సిరీస్ అయినప్పటికీ ఇతర భాషల నటులు ఎక్కువగా కనిపించడం వల్ల మన నేటివిటీ కొంత లోపించింది. దీనితో ఇది తెలుగుయ్ సిరీస్ అయినప్పటికీ ఓ డబ్బింగ్ సిరీస్ చూస్తున్నామా అనే ఫీల్ కలుగక మానదు.
అలాగే కొన్ని కీలకమైన సీన్లను ఇంకా బలంగా డిజైన్ చేసి ఉండాల్సింది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ముగిసినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. ఎల్.వి. ముత్తు గణేష్ సంగీతం మరియు శ్రీశ కుడువల్లి సినిమాటోగ్రఫీ సిరీస్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది.
ఇక దర్శకుడు రమేష్ ఇందిరా విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో సఫలమయ్యారు. కాకపోతే నటీనటులు పరంగా ఇంకా కేర్ తీసుకొని కథనాన్ని మరింత గ్రిప్పింగ్ గా డిజైన్ చేసి ఉంటే ఈ సిరీస్ మరింత హైలైట్ అయ్యేది.
తీర్పు:
మొత్తంగా చూసుకుంటే, “పోచమ్మ” ఒక డీసెంట్ మిస్టరీ సిరీస్ అని చెప్పొచ్చు. సాగదీత లేకుండా వెళ్లే కథనం మరియు ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. కథ కొంత ఊహాజనితంగా ఉండటం మరియు డబ్బింగ్ లోపాలు చిన్న మైనస్ అయినప్పటికీ, వీకెండ్‌లో ఏదైనా ఇంట్రెస్టింగ్ మిస్టరీ చూడాలనుకునే వారికి ‘పోచమ్మ’ డీసెంట్ ట్రీట్ అందిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


