దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఐతే, జూన్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్ లో మహేష్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు నెలకు పైగా షూటింగ్ సాగనుంది. ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
అన్నట్టు ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. కాగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


