మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ, నైజాం ఏరియాలో టికెట్ ధరల పెంపు మరియు థియేటర్ల కేటాయింపు వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపును మొదట వ్యతిరేకించి, ఆ తర్వాత పెంచిన ధరల్లో 7.5 శాతం వాటా డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఎగ్జిబిటర్ల ద్వంద్వ వైఖరిపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ మనుగడకు, థియేటర్ల వ్యవస్థ బ్రతకడానికి పర్సంటేజ్ సిస్టమ్ ఎంత అవసరమో ఆయన విశ్లేషించారు.
తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వెళ్లడంపై వస్తున్న రూమర్స్‌కు సునీల్ నారంగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “ఇందులో ఆంధ్ర, తెలంగాణ అనే బేధాలు లేవు. పవన్ కళ్యాణ్ మన సినిమా ఇండస్ట్రీ మనిషి, మనవాడు. కొంతమంది ఆయన దగ్గరకు వెళ్లి మాకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకే ఆ విషయంలో స్పష్టత ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికే మేము పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్నాం” అని సునీల్ స్పష్టం చేశారు. దీని ద్వారా పరిశ్రమలోని అంతర్గత విభేదాలను రాజకీయంగా కాకుండా, ఇండస్ట్రీ పెద్దల ద్వారానే పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
గత కొంతకాలంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారనే ప్రచారంపై సునీల్ ఓపెన్‌గా మాట్లాడారు. తాము ‘పెద్ది’ సినిమా విషయంలో మైత్రీ సంస్థకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, కానీ వారి నుండి తమకు ఆశించిన మద్దతు లభించడం లేదని ఆరోపించారు. “మేము మైత్రీకి సపోర్ట్ ఇస్తున్నాం, కానీ వారు మా థియేటర్లను కాదని, ఇతరుల థియేటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అనుసరిస్తున్న థియేట్రికల్ పంపిణీ వ్యూహంపై సునీల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మైత్రీ సంస్థ వ్యవహరిస్తున్న ఈ శైలి వల్ల రాబోయే ‘పెద్ది’ సినిమా కలెక్షన్లకు లేదా వారి బిజినెస్‌కు నష్టం వాటిల్లదా? అనే ప్రశ్నకు సునీల్ నారంగ్ అత్యంత ప్రాక్టికల్‌గా సమాధానమిచ్చారు. “ఈ ప్రశ్న మీరు నాకంటే వారిని అడిగితేనే బాగుంటుంది. వ్యాపారం అనేది ఎప్పుడూ మెదడుతో చేయాలి, గుండెతో కాదు. నేను ఎప్పుడూ బిజినెస్‌ను ప్రాక్టికల్‌గానే చూస్తాను, కానీ వారు మాత్రం అలా చేయడం లేదు” అంటూ మైత్రీ నిర్ణయాల వెనుక ప్రొఫెషనలిజం లోపించిందనేలా వ్యాఖ్యానించారు.
ఇక పర్సంటేజ్ సిస్టమ్ వస్తే లీజ్ ఓనర్లకు నష్టం జరుగుతుందనే ప్రచారాన్ని సునీల్ పూర్తిగా కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తూ.. “పర్సంటేజ్ సిస్టమ్ అనేది థియేటర్ యజమానులకు అదనంగా వచ్చే 10-12 లక్షల రూపాయల గురించినది. థియేటర్లు సర్వైవ్ అవ్వడానికి, నిలబడడానికి ఈ అదనపు ఆదాయం ఎంతో అవసరం. ఒకసారి పర్సంటేజ్ సిస్టమ్ అమల్లోకి వస్తే, ఈ లీజ్ యజమానుల గొడవలు పోతాయి. లేదంటే వారు మనకు థియేటర్లు ఇవ్వరు, అసలు లీజ్ సిస్టమే అంతరించిపోతుంది” అంటూ ఎగ్జిబిటర్ల మనుగడకు పర్సంటేజ్ పద్ధతి ఎంత కీలకమో సునీల్ నారంగ్ తేల్చిచెప్పారు.


