ముఖ్య అంశాలు
- ప్రముఖ టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్యపై ఆమె తండ్రి మశ్చీంద్ర ఉగలే సంచలన ఆరోపణలు చేశారు.
- తన కూతురిని ఎవరో డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ తీవ్రంగా టార్చర్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
టెలివిజన్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తూ ప్రముఖ యువ నటి సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ‘కుంకుమ్ భాగ్య’, ‘వాగ్లే కీ దునియా’ లాంటి హిట్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న 22 ఏళ్ల సంచిత.. ఇలా సడెన్‌గా ప్రాణాలు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఆమె మరణం వెనుక పెద్ద ఎత్తున వేధింపులు ఉన్నాయని సంచిత తండ్రి మశ్చీంద్ర ఉగలే కన్నీరుమున్నీరవుతున్నారు.
వాళ్లు నా బిడ్డను టార్చర్ చేశారు
సంచిత మరణం తర్వాత మొదటిసారి ఎన్డీటీవీతో మాట్లాడిన ఆమె తండ్రి ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టారు. ఆమె పైకి నవ్వుతూ కనిపించినా, లోపల తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేదని ఆయన చెప్పుకొచ్చారు. “నా కూతురు ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనలో ఉండేది. ఆమె మనసులో ఏముందో మాకు పూర్తిగా చెప్పకపోయినా.. ఎవరో ఒకరు డబ్బుల కోసం లేదా ఇతర విషయాల కోసం ఆమెను నిరంతరం డిమాండ్ చేస్తూ టార్చర్ చేసేవారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లింది” అని ఆయన ఆరోపించారు. కూతురి ప్రవర్తనలో మార్పులు గమనించిన తాము ఎప్పుడూ ఆమె వెన్నంటే ఉండేవాళ్లమని, కానీ ఓ అరగంట పాటు ఆమెను ఒంటరిగా వదిలేయడమే తాము చేసిన అతిపెద్ద తప్పు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాము కలలో కూడా ఊహించలేదని ఆయన గుండెబద్ధలయ్యేలా ఏడ్చారు.
అసలు నిజాలు బయటికి రావాలి..
సంచిత ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో తన పడకగదిలో ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని స్పష్టం చేశారు. అయితే, తన బిడ్డ చావుకు కారణమైన వాళ్లెవరో కచ్చితంగా బయటపడతారని సంచిత తండ్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును లోతుగా విచారించి తన కూతురికి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు. ఇదే సమయంలో ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా రంగంలోకి దిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇలాంటి ఆత్మహత్యల ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. సంచిత కేసుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ఏదేమైనా.. చేతినిండా అవకాశాలతో కెరీర్‌లో దూసుకుపోతున్న ఓ యువ నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.


