రివ్యూ: ఓ..! సుకుమారి – రొటీన్‌గా సాగే కామెడీ డ్రామా!

రివ్యూ: ఓ..! సుకుమారి – రొటీన్‌గా సాగే కామెడీ డ్రామా!

Published on Jul 18, 2026 2:14 AM IST

విడుదల తేదీ : జూలై 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : తిరువీర్, ఐశ్వర్య రాజేష్, ఆమని, ఆనంద్ తదితరులు
దర్శకత్వం : భరత్ దర్శన్
నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలి
సంగీతం : భరత్ మంచిరాజు
ఛాయాగ్రహణం : సీహెచ్. కుశేందర్
కూర్పు: శ్రీ వరప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

విలక్షణమైన కథలను ఎంచుకునే తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నేడు థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్‌తో కాస్త ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.

కథ:

సర్పంచ్ కావాలని కలలు కనే నరాల యాదగిరి (తిరువీర్) కి ఒక షరతు మీద తన తాత రాసిన రూ. 80 కోట్ల ఆస్తి దక్కుతుందని తెలుస్తుంది. ఆ ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకున్న యాదగిరి, పెళ్లిచూపులకి వెళ్లి అనుకోకుండా దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే, దామినిని చూసి భయపడే ఆ ఊరి జనాలు ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని తెగ ఆరాటపడతారు. యాదగిరికి అసలు నిజం చెప్పకుండానే పెళ్లి చేసేస్తారు. కానీ, ఫస్ట్ నైట్ రోజు అతనికి ఊహించని షాక్ తగులుతుంది. అసలు దామిని సమస్య ఏంటి? ఊరి వాళ్లంతా ఆమెను చూసి ఎందుకు భయపడతారు? చివరకు యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఓ..! సుకుమారి’ కథ.

ప్లస్ పాయింట్స్:

ఇటీవల వరుసగా మంచి పాత్రలతో మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేష్, ఈ సినిమాలోనూ తనదైన మార్క్ చూపించారు. సినిమా ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

ఇక యాదగిరి క్యారెక్టర్‌లో తిరువీర్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ముఖ్యంగా అసలు నిజం ఏంటో తెలిశాక, ఐశ్వర్యతో ఆయనకు ఉండే సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో వచ్చే ఇలాంటి కొన్ని ఫన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌కు మంచి రిలీఫ్ ఇస్తాయి. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్.. సులభంగా ఊహించగలిగే కథనం. సినిమాలోని అసలు ట్విస్ట్‌ను ప్రమోషన్స్‌లోనే రివీల్ చేయడం వల్ల, ఆ తర్వాత ఆసక్తికరమైన సన్నివేశాలతో మెప్పించాల్సిన బాధ్యత దర్శకుడిపై పడింది. కానీ భరత్ దర్శన్ ఆ విషయంలో బాగా తడబడ్డారు.

ఫస్టాఫ్‌లో పాతకాలపు కామెడీనే నమ్ముకున్నారు. కొన్ని సన్నివేశాలు మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక, మంచి ఎమోషనల్ డ్రామా పండే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు రొటీన్ దారిలోనే వెళ్లారు. దీంతో సెకండాఫ్ బాగా సాగదీసినట్లు, ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగుతుంది.

ప్రధాన పాత్రల్లో నటించిన ఐశ్వర్య రాజేష్, తిరువీర్‌ల క్యారెక్టరైజేషన్స్‌లో కూడా లోతు లేదు. వారు ఎంత బాగా నటించినా, ఆ పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అలాగే, ఐశ్వర్య రాజేష్ మాటిమాటికీ వాడే ‘ఉచ్చు’ అనే పదం ఒక దశ దాటాక చిరాకు తెప్పిస్తుంది. ఆమని, ఆనంద్ లాంటి సీనియర్ నటులకు మంచి స్కోప్ ఉన్నా, వారిని సరిగ్గా వాడుకోలేదు. ఫ్యామిలీ డ్రామాలో కూడా ఎమోషన్ మిస్ అవ్వడంతో కథతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు.

సినిమాకు కామెడీయే ప్రధాన బలం అనుకుంటే.. అది కూడా వర్కవుట్ కాలేదు. కొన్ని జోకులు మినహా చాలా చోట్ల నవ్వు రాదు. నటీనటులు కూడా సహజంగా కాకుండా, కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఒక ఆసక్తికరమైన పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు భరత్ దర్శన్, దాన్ని పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మలచలేకపోయారు. బలహీనమైన రైటింగ్, అవుట్‌డేటెడ్ నేరేషన్ సినిమాకు పెద్ద డ్రా బ్యాక్. కుశేందర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. భరత్ మంచిరాజు సంగీతం కొన్ని చోట్ల ఓకే అనిపించినా, గుర్తుండిపోయేలా లేదు. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది, ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయొచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా డీసెంట్‌గా ఉన్నాయి.

తీర్పు:

మొత్తంగా చూసుకుంటే… ‘ఓ..! సుకుమారి’ కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకున్నా, ఎగ్జిక్యూషన్‌లో తడబడిన రొటీన్ కామెడీ డ్రామా. లీడ్ పెయిర్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ నటనతో సినిమాకు కొంతవరకు బలాన్నిచ్చారు. అయితే, రొటీన్ కథనం, ఫ్లాట్‌గా సాగే సెకండాఫ్ వల్ల ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. ‘ముట్టుకుంటే షాక్ కొట్టే’ పాయింట్ చుట్టూ ఇంకాస్త బలమైన ఎమోషన్, మంచి కామెడీ రాసుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. అలా అని మరీ తీసిపారేసే విధంగా కూడా లేదు. అక్కడక్కడా వర్కవుట్ అయిన కొన్ని ఫన్ ఎలిమెంట్స్ సినిమాకు కాస్త ఊరటనిస్తాయి. వారాంతంలో ఏదైనా మంచి ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే, ఈ సినిమా కొంత నిరాశపరుస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు