భారతదేశపు అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు ‘రామాయణ’ చిత్ర బృందం సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహా ప్రయాణం న్యూఢిల్లీలో జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుకతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రశాంగించారు.
ఈ చిత్రంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తూనే మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు సన్నీ డియోల్ (హనుమంతుడు), అరుణ్ గోవిల్ (దశరథుడు), శోభన (కైకేయి) వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, DNEG భాగస్వామ్యంతో అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అలాగే ‘రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్’ ద్వారా దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల విద్యార్థులను కూడా ఈ ప్రయాణంలో భాగస్వామ్యం చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ చలనచిత్రం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


