మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు ఆలస్యమవుతుండటంతో అభిమానులలో గందరగోళం నెలకొంది. ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలని చిత్రబృందం భావిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా, చిరంజీవి మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయడానికి ఆయన నాలుగు రోజుల సమయం కేటాయించారని, ఈ స్వల్ప వ్యవధిలోనే పెండింగ్‌లో ఉన్న రీషూట్ భాగాలన్నింటినీ పూర్తి చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకోవడానికి మేకర్స్ నాన్-థియేట్రికల్ హక్కుల డీల్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి పాటలు, హరి గౌర నేపధ్య సంగీతాన్ని అందిస్తున్నారు.


