సూర్య హీరోగా, మమితా బైజు హీరోయిన్ గా తెరకెక్కిన ఎమోషనల్ కుటుంబ కథా చిత్రం “విశ్వనాథ్ అండ్ సన్స్”. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, కాళీ వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కోయంబత్తూర్‌లో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ వేడుకలో నిర్మాత నాగవంశీ పాల్గొని సినిమాపై ఉన్న ధీమాను వ్యక్తం చేశారు. షూటింగ్ మరియు ప్రమోషన్స్ కోయంబత్తూర్ నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నగరం తమ చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకలో నాగవంశీ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో సూర్య నటన, ఐకానిక్ ‘సంజయ్ రామస్వామి’ పాత్రను గుర్తుచేసేలా ఉంటుందని రీ-అఫర్మ్ చేశారు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి విజయాన్ని సాధించిందో, తమిళంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిస్తుందనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌తో తమ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతూ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా రాకపోతే సూర్య అభిమానులు ఊరుకోరంటూ సరదాగా వ్యాఖ్యానించారు.


