టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ రాబోతోందనే వార్తలపై నిర్మాత వై. రవిశంకర్ స్పందించారు. ఇటీవల జరిగిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, ఈ కాంబినేషన్‌పై స్పష్టత ఇచ్చారు.
వెంకీ అట్లూరితో తమ బ్యానర్లో ఎప్పుడో సినిమా చేయాల్సి ఉందని, అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఆ అవకాశం కుదరలేదని తెలిపారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ రవిశంకర్ వ్యాఖ్యానించారు. “కొన్నేళ్ల క్రితం నిర్మాత కేఎల్ నారాయణ గారికి రాజమౌళి గారు ఒక మాట ఇచ్చారు. ఆ కమిట్మెంట్కు కట్టుబడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వారి నిర్మాణంలో ‘వారణాసి’ లాంటి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు” అని గుర్తుచేశారు.
అదే తరహాలో వెంకీ అట్లూరి కూడా భవిష్యత్తులో మరింత పెద్ద దర్శకుడిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాజమౌళి లాగే వెంకీ అట్లూరి కూడా తమ బ్యానర్లో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


