సూపర్‌స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ జరుగుతున్న ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పూర్తయిన తర్వాత మహేష్ ఈ చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి.
రాజమౌళి సినిమా తర్వాత నటులకు ఎదురయ్యే సెంటిమెంట్‌ను ఎదుర్కోవడానికి అనిల్ మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సరైన ఎంపిక అని ఫ్యాన్స్ భావించినప్పటికీ, ఈ వార్తలను అనిల్ రావిపూడి ఖండించారు. ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని తేల్చిచెప్పారు. అయితే, అనిల్ ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో కలసి సరికొత్త చిత్రంపై పనిచేస్తుండటంతో పాటు మరో కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఈ రూమర్లకు మళ్లీ రెక్కలు తొడిగింది. అంతేగాక ఈ సినిమా కోసం మహేష్ బాబు సరసన మమిత బైజుని హీరోయిన్‌గా తీసుకోవాలని అనిల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
‘వారణాసి’ లాంటి భారీ సినిమా తర్వాత మహేష్ కూడా రీఫ్రెషింగ్ కమర్షియల్ మూవీ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ కేవలం ప్రచారానికే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో ఇది నిజ రూపం దాల్చుతుందో లేదో వేచి చూడాలి.


