కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామి సంస్థలు భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఆంత్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆంత్రోపిక్‌లో మూడేళ్లపాటు ప్రీ-ట్రైనింగ్ విభాగంలో పనిచేసిన ఈ 27 ఏళ్ల పరిశోధకుడు, తన నిష్క్రమణకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన వ్యక్తం చేసిన ఆందోళనలు ఇప్పుడు సాంకేతిక రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి.
బాధ్యతారాహిత్యమైన పోటీపై విమర్శలు
గతంలో ఓపెన్ఏఐలో, ఆ తర్వాత ఆంత్రోపిక్‌లో పనిచేసిన జాకబ్.. రెండు సంస్థల పనితీరును తప్పుబట్టారు. స్వయంగా మెరుగుపడే (సెల్ఫ్-ఇంప్రూవింగ్) సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేసే క్రమంలో కంపెనీలు ప్రమాదకరమైన పోటీలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. “ఈ దశాబ్దం ముగిసేలోపే ఏఐ వల్ల మానవాళి ఉనికికే పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్వయంగా దీనిని రూపొందిస్తున్న నిపుణులే బలంగా విశ్వసిస్తున్నారు. బాహ్య ప్రపంచం లేదా మీడియా ముందుకు వచ్చినప్పుడు సాధారణ ప్రకటనలు చేసే సీనియర్ పరిశోధకులు, అంతర్గతంగా మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు” అని ఆయన తెలిపారు.
ఓపెన్ఏఐలో ఈ ముప్పు తీవ్రతను ఇంకా సమగ్రంగా గుర్తించలేదని, అదే ఆంత్రోపిక్ విషయానికి వస్తే ప్రమాదం తెలిసినప్పటికీ పోటీలో వెనుకబడిపోతామనే భావనతో పరుగు కొనసాగిస్తోందని జాకబ్ విశ్లేషించారు. తాము వెనక్కి తగ్గితే ప్రత్యర్థి సంస్థలు ముందుకెళ్తాయనే భయంతో రిస్క్ తెలిసినా ఈ రేసులో భాగమవుతున్నారని పేర్కొన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ స్వభావం, దాని పర్యవసానాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడేవరకు ఇలాంటి ప్రయోగాలను వేగవంతం చేయడం సరికాదని చెప్పారు. ఏఐ మోడళ్ల సామర్థ్యాల విస్తరణపై తాత్కాలిక విరామం (Pause) ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని ఇతర పరిశోధకులకు పిలుపునిచ్చారు.
ఆంత్రోపిక్ ప్రతినిధి స్పందన
జాకబ్ పోస్ట్‌పై ఆంత్రోపిక్ అలైన్‌మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ స్పందించారు. రాబోయే దశాబ్దంలో ఏఐ కారణంగా మానవాళికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం 10 శాతానికి పైగానే ఉందని తాను కూడా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లతో ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ, రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ద్వారా భవిష్యత్తులో అవతరించే సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల విషయంలో పటిష్టమైన భద్రతా ప్రణాళికలు అత్యావశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు.
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
— Jacob Coxon (@hilbertspaess) September 9, 2026


