అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
డెకాయిట్’ తెలుగు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది కదా.. మరి హిందీలో స్పందన ఎలా ఉంది?
హిందీలో మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రీచ్ లభించింది. మొదటిసారి భోజ్‌పురిలో కూడా ప్రీమియర్ చేస్తారా అని అడిగే స్థాయికి క్రేజ్ రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా పవన్ సింగ్ గారు ఈ చిత్రంలో నటించడం భోజ్‌పురి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీ గత సినిమాలతో పోలిస్తే ఈ లవ్ స్టోరీ స్పెషాలిటీ ఏంటి?
నా పాత సినిమాల్లో ప్రేమ కథ ఒక భాగం మాత్రమే, కానీ ఈ సినిమాలో ప్రేమ కథే ప్రధానాంశం. కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్స్ చాలా సహజంగా ఉంటాయి.
ఈ కథకు ప్రేరణ ఏంటి?
ఒక బిజీ రోడ్డుపై ఫుట్ పాత్ పగుళ్ల నుంచి ఒక చిన్న పువ్వు బయటకి వస్తున్న విజువల్ మెటాఫర్ నుండి ఈ కథ పుట్టింది. ఆ ఊహ నుంచే తీవ్రమైన కోపం, యాక్షన్ మధ్యలో సాగే ఈ లవ్ స్టోరీని సిద్ధం చేశాం.
‘కన్నె పెట్టరో’ సాంగ్ ఐడియా ఎవరిది?
ఈ ఆలోచన సుప్రియ గారిదే. నా పాత్ర ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉన్నప్పుడు వచ్చే పాట ఇది. చిన్నప్పుడు నేను డ్యాన్స్ చేసిన సాంగ్స్ గురించి చెప్పినప్పుడు, ఆమె వీటిని వాడదామని సూచించారు. అలా తెలుగులో ‘కన్నె పెట్టరో’, హిందీలో ‘చీజ్ బడి హై’ పాటలను సరైన ప్లేస్‌మెంట్‌లో ఉపయోగించాం. పోలాకి విజయ్ గారి కొరియోగ్రఫీలో ఈ సాంగ్స్ బాగా వచ్చాయి.
ప్రొడ్యూసర్ సుప్రియ గారి గురించి మీ అభిప్రాయం?
ఈ సినిమాకు సుప్రియ గారే కర్త, కర్మ, క్రియ. వంద రోజులు షూటింగ్ చేయడం అంటే వంద పెళ్లిళ్లు చేయడంతో సమానం; ఎన్నో సమస్యలు, ఈగోలను ఆమె ఓపికగా భరించారు.
అనురాగ్ కశ్యప్ గారి గురించి చెప్పండి?
నాగచైతన్య, శోభితల పెళ్లి వేడుక కోసం ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశాం. సుప్రియ గారు అప్పటికే ఆయనతో సినిమా గురించి మాట్లాడటం మాకు సర్ప్రైజ్ అనిపించింది. కథ వినగానే ఇంప్రెస్ అయ్యారు; ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి.
మృణాల్ ఠాకూర్ గురించి మీ అనుభవం?
మృణాల్ అద్భుతమైన నటి. ఆమె సీన్ లోని ఎమోషన్‌ను నిజంగా ఫీల్ అవుతుంది; తన పర్ఫార్మెన్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నటన చూశాక నేను కూడా నా నటనను మెరుగుపరుచుకోవాలనే కాంపిటీషన్ స్పిరిట్‌తో పనిచేశాను.
డైరెక్టర్ షానియల్ డియో గురించి?
మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, అన్నదమ్ముల్లా ఉంటాం. అయితే సినిమా విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకుండా పనిచేశాం.
‘జి2’ (G2) అప్డేట్ ఏంటి?
ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది.
