ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు : చిరంజీవి – మోహన్ బాబులతో సినిమా చేయడమే నా డ్రీమ్ ప్రాజెక్ట్

ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు : చిరంజీవి – మోహన్ బాబులతో సినిమా చేయడమే నా డ్రీమ్ ప్రాజెక్ట్

Published on Oct 19, 2012 6:27 PM IST


కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమైన మంచు విష్ణు ఈ దసరాకి ‘దేనికైనా రెడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ అందరికీ పూర్తి హాస్యాన్ని పంచుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. సున్నితంగా మాట్లాడే విష్ణు ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు మరియు తన సొంత బ్యానర్ కి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మంచు విష్ణుతో ఆయన ఆఫీస్ లో మేము తనతో కొద్దిసేపు ముచ్చటించాము. అలా ఆయనతో సరదాగా ముచ్చటించిన విశేషాలు మీకోసం అందిస్తున్నాం..

ప్రశ్న)‘ఢీ’ సినిమా వచ్చిన 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత పూర్తి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసారు. ఈ సినిమా పై మీకున్న అంచనాలు ఏమిటి?

స)‘దేనికైనా రెడీ’ సినిమా నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అలాగే నా కెరీర్ కి స్టార్ డమ్ తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాదిస్తుంది మరియు సినిమా చూసినంత సేపు నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్రశ్న)సులేమాన్ మరియు కృష్ణ శాస్త్రి, ఈ రెండు పాత్రలు సినిమా మొత్తం ఉంటాయా?

స) (నవ్వుతూ)., అది మీరు తెరపైనే చూడాలి. ఇప్పటికి మాత్రం ఆ రెండు పాత్రలని బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను. ఈ సినిమాకి సంబందించిన పూర్తి క్రెడిట్ దర్శకుడికి మరియు కథా రచయితలకే చెందుతాయి.

ప్రశ్న)ఈ చిత్ర ప్రోమోస్ చూస్తుంటే సినిమాలో బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రలు పోషించినట్టున్నారు. ఈ సినిమాలో వారి నుంచి మేము ఏమి ఆశించవచ్చు?

స)ఈ సినిమా కథ విన్నప్పుడు నాన్నగారు ఒకటే చెప్పారు ” ఈ సినిమా చెయ్యి విష్ణు, బ్రహ్మానందం మరియు ఎం. ఎస్ నారాయణ ఒప్పుకోవడమే మిగిలి ఉంది అని’ ఆయన అన్నారు. ఆయన అలా అన్నారు అంటే వారి పాత్రలకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవాలి. ఈ సినిమాలో వారు బద్ధ శత్రువులుగా కనపడతారు. ఎం.ఎస్ నారాయణ బ్రహ్మానందంకి ఇబ్బందులు కలుగజేయాలని చూస్తుంటాడు, బ్రహ్మానందం వాటిని తిప్పి కొడుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్యలో నేను వస్తూ ఉంటాను.

ప్రశ్న)ఈ సినిమాలో కొత్తగా ఏమన్నా ట్రై చేసారా? అంటే మీరు ఇంతక ముందు సినిమాల్లో చేయనివి కాకుండా ఏమన్నా ట్రై చేసారా?

స)ఈ సినిమాలో మంచి డాన్సులతో అలరించనున్నాను. నేను ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ ని కాకపోవచ్చు, కానీ మాములుగా నేను మంచి డాన్సర్. నేను ఇంతక ముందు చేసిన సినిమాల్లో నా డాన్సులను నిరూపించుకునే అవకాశం రాలేదు. కానీ ఈ సినిమా ఆ పేరును పోగొడుతుంది. ప్రేమ్ రక్షిత్ చాలా మంచి స్టెప్పులు కంపోస్ చేసారు.

ప్రశ్న)నటన మరియు ప్రొడక్షన్, ఈ రెండిటిలో మీ మనసుకు బాగా నచ్చినది ఏది?

స)నేను ఒక నటుడిగా పుట్టాను. నాకు నటన అంటే చాలా ఇష్టం మరియు నా మొదటి కోరిక కూడా అదే. ఇక ప్రొడక్షన్ విషయానికొస్తే నేను ఆ వాతావరణంలోనే పెరిగాను మరియు నాకు అది చాలా సహజంగా అనిపిస్తుంది. నేను నటుడు కాకముందు ప్రొడక్షన్ పనులు చూసుకునే వాన్ని, నటుడినయ్యాక పూర్తి భాద్యతలు తీసుకున్నాను.

ప్రశ్న)నటన కాకుండా, మీరు బాగా ఆసక్తి చూపించే అంశాలేవి?

స) నాకు నటన కాకుండా నా మనసుకి ఇష్టమైనది సోషల్ వెల్ఫేర్ పనులు చేయడం. నా సొంత డబ్బుతో నేను కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నాను. ఆ గ్రామాల్లో శుబ్రత మరియు పారిశుధ్యం కోసం కొన్ని చెత్త కుండీలను ఏర్పాటు చేసాం. కానీ అక్కడి అధికారులు వాటిని రోజు వారీగా తీసెయ్యకుండా అలానే ఉంచేస్తున్నారు. ఆ విషయం చాలా బాధ కలిగించింది. నేను చెప్పగానే విద్యానికేతన్ స్టూడెంట్స్ ఎంతో మంది వాలెంటరీలుగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. వారు చేస్తున్న పనికి వాళ్ళని ఖచ్చితంగా అభినందించి తీరాలి.

ప్రశ్న)చాలా మంచి పని చేస్తున్నారు, ఇంతకీ అరి – వివి ఎలా ఉన్నారు?

స)(ఒక్కసారిగా ఆకాశంలో కనిపించే నక్షత్ర కాంతి ఆయన ముఖంలో కనపడింది) చాలా బాగున్నారు మరియు నా కుటుంబానికి వాళ్ళు డార్లింగ్స్ అయిపాయారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం వాళ్ళ అమ్మతో కలిసి యు.ఎస్ టూర్ వెళ్ళారు, త్వరలోనే వచ్చేస్తారు. వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను.

ప్రశ్న)కో స్టార్ గా హన్సికకి ఎన్ని మార్కులు వేస్తారు?

స)వృత్తికి ఎంతో గౌరవం ఇస్తూ, ఎంతో సరదాగా ఉండే కో స్టార్ హన్సిక. తనది వెంటనే ఆకట్టుకునే స్మైల్, నేను సెట్లో వేసే జోక్స్ కి కంటిన్యూగా నవ్వుతూనే ఉండేది. నేను చెప్పే చాలా పాత జోక్స్ ని కూడా బాగా ఎంజాయ్ చేసేది. ఇవన్నీ పక్కన పెడితే తనతో పని చేయడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం.

ప్రశ్న)దర్శకుడు నాగేశ్వర రెడ్డి గురించి చెప్పండి?

స) ఆయన చాలా టాలెంటెడ్ టెక్నీషియన్ మరియు అతని టాలెంట్ మీరు ఈ సినిమాలో చూస్తారు. సినిమాని చాలా బాగా తీసారు మరియు ఆయనతో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాన్నగారు కూడా ఈ సినిమా చూసి చాలా బాగా వచ్చిందని సంతోషంగా ఉన్నారు.

ప్రశ్న) ఎంతో డేర్ గా రియల్ గా స్టంట్స్ చేస్తారని మీకు పేరు ఉంది, అలాంటివి ఈ ‘దేనికైనా రెడీ’లో కూడా చూడవచ్చా?

స) (నవ్వుతూ).. చూడొచ్చు. ఈ సినిమాకి కూడా మంచి స్టంట్ టీం దొరికింది మరియు అందరికీ నచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో కూడా ఉంటాయి. నేను ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉపయోగించాము. అవి చాలా బాగా వచ్చాయి కానీ వాటిని మీరు గుర్తుపట్టలేరు. స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా సహజంగా ఉంటాయి. నాకున్న వి.ఎఫ్.ఎక్స్ నాలెడ్జ్ వాడి చేసాము.

[ ఈ విషయం నిజమని నిరూపించడానికి ఆయన నా కొక చిన్న క్లిప్ చూపించి ఇందులో చేసిన స్పెషల్ ఎఫెక్ట్ ఏంటో కనుక్కోమన్నారు, నేను కనిపెట్టలేకపోయాను తర్వాత ఆయనే చూపించారు]

ప్రశ్న) మీ తదుపరి చిత్రాలేమిటి ?

స) ప్రస్తుతం ‘రావణ’ అనే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మా నాన్నగారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తారు. ఈ సినిమా ఇండియా భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. కానీ ఈ చిత్రాన్ని 65 – 70 రోజుల్లో తీసేద్దామని అనుకుంటున్నాం. గోపి మోహన్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. అది కాకుండా నాన్న గారి ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాని రిమేక్ చెయ్యాలనుకుంటున్నాం. నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం మరియు ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ ఇప్పటికి తగ్గట్టుగా కథను తయారు చేస్తున్నారు.

ప్రశ్న) మీరు కామెడీ బాగా చేస్తారు. ఇదే విధంగా మరిన్ని కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తారా?

స) ప్రతి సినిమాకి కామెడీ చాలా అవసరం అని నేను నమ్ముతాను. నోలాన్ తీసిన డార్క్ నైట్ సీరిస్ తీసుకుంటే అందులో సీరియస్ సన్నివేశాల్లో కూడా తెలియకనే డైలాగ్స్ లో కామెడీ కనిపిస్తుంది. అందరికీ కామెడీ చాలా నచ్చుతుంది. నేను ఇకముందు కూడా కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తాను.

ప్రశ్న) ‘దేనికైనా రెడీ’ రిలీజ్ కి మీ ప్లాన్స్ ఏమిటి?

స) సినిమాని బాగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ దసరా సీజన్లో థియేటర్లు దొరకడం కష్టమైనా పనే కనుక మాకు ఎన్ని థియేటర్లు దొరికితే అన్నింటిలో విడుదల చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అప్పుడు థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. ఈ సినిమాని న్యూ యార్క్ మరియు పారిస్ లలో ప్రత్యేకంగా విడుదల చేయాలనుకుంటున్నాం.

ప్రశ్న) మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా?

స) (నవ్వుతూ) నాకు చిరంజీవి గారిని – మా నాన్న గారిని కలిపి ఒక మల్టీ స్టారర్ సినిమాలో చూడాలని ఉంది. అందులో నాన్నది నెగటివ్ రోల్ అయి ఉండాలి. వారిద్దరినీ తెరపై చూడటం చాలా బాగుంటుంది మరియు అది జరగాలని కోరుకుందాం. ప్రస్తుతం వారు ఉన్న షెడ్యూల్స్ లో డేట్స్ ఇవ్వడం చాలా కష్టం మరియు బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అయినా అవకాశం వస్తే నేను ట్రై చేస్తాను.

ప్రశ్న) పైరసీని అరికట్టడానికి ఏమన్నా ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయా?

స) (ఉన్నట్టుండి కోపంగా తిరిగి చూసారు) ఈ విషయం పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరో ముగ్గురు లేదా నలుగురు చేసే విధంగా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళని కనిపెట్టొచ్చు. కానీ ఈ విషయం పై ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళేమో కొన్ని రోజుల్లో విడుదలై పోయి వెళ్లి పోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా అడిగాను 1 – 1.5 కోట్ల ఫండ్ కలెక్ట్ చెయ్యండి అని, అది వాళ్ళు చేస్తే నేను స్వయంగా రంగంలోకి దిగి దానిని పరిష్కరిస్తాను.

ప్రశ్న) ‘దేనికైనా రెడీ’ సినిమా గురించి సినీ ప్రేమికులకు మీరిచ్చే మెసేజ్ ఏమిటి?

స) ఈ సినిమా చలా క్లీన్ ఎంటర్ టైనర్, మీకు చాలా నవ్వలని పంచుతుంది. సినిమాని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కించాము. ఈ దసరాకి విడుదలవుతున్న ఈ సినిమాకి సినీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

అప్పటివరకూ సరదాగా సాగిన మా సంభాషణ ఇంతటితో ముగిసింది. విష్ణుతో ఒక స్నేహితునిలా బాగా కలిసిపోయి మాట్లాడుతున్నంత సేపు బాగా ఎంజాయ్ చేసాను. మీకు కూడా ఈ ఇంటర్వ్యూ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ‘దేనికైనా రెడీ’ విడుదల సందర్భంగా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, మంచు విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు