ప్రత్యేక ఇంటర్వ్యూ : నందిని రెడ్డి – సెన్సార్ బోర్డ్ చర్యలు భాధాకరం

ప్రత్యేక ఇంటర్వ్యూ : నందిని రెడ్డి – సెన్సార్ బోర్డ్ చర్యలు భాధాకరం

Published on Feb 20, 2013 9:37 PM IST

Nandini-Reddy
అలా మొదలైంది సినిమాతో అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది నందిని రెడ్డి. మహిళా దర్శకురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమానే సూపర్ హిట్ కొట్టి రెండవ సినిమా జబర్దస్త్ తో రెడీ ఐపోయింది. సిద్ధార్థ్, సమంత, నిత్య మీనన్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి బెల్లకొండ శ్రీనివాస్ నిర్మించారు. ఫిబ్రవరి 22న ప్రేక్షకులు ముందుకి రాబోతున్న ఈ సినిమా విశేషాలను నందిని మాటల్లో …

ప్రశ్న : మీ మొదటి సినిమా అలా మొదలైంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ మీద అంచనాలు బాగా ఉన్నాయి, ఎలా బాలన్స్ చేయగలుగుతున్నారు?
స : జబర్దస్త్ అవుట్ పుట్ మీద నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒత్తిడి ఉండటం సహజమే. కానీ సినిమా ఎలాగు పూర్తయింది కదా, ఫలితం కోసం ఎదురు చూడటం తప్ప ఏం చేయలేం కదా (నవ్వుతూ).

ప్ర : ఫస్ట్ టైం ఇద్దరు పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసారు. సిద్దార్థ్, సమంతని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
స : స్టార్స్ ని డైరెక్ట్ చేయడం అంత కష్టమైనా పనేమీ కాదు. వారు మీకు కనెక్ట్ అయి, అభిప్రాయాలు కలిసినపుడు కలిసి పనిచేయడం ఈజీ అవుతుంది. సిద్ధార్థ్, సమంత ఇద్దరినీ స్టార్స్ లాగా కాకుండా ఇద్దరు యాక్టర్స్ లాగే భావించా. ఇద్దరూ స్క్రిప్ట్ నమ్మి పనిచేసారు.

ప్ర : సిద్ధార్థ్ గతంలో మాస్ కామెడీ పాత్రలు చేయలేదు. ఇప్పుడు ఇది రిస్క్ అనిపించట్లేదా?
స : సిద్ధార్థ్ చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తుంటే అవే రిపీట్ చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తారు. అందుకే నా సినిమాలో కొత్తగా ట్రై చేయించాలని అనుకున్నా. సిద్ధార్థ్ ఇంతకు ముందు చేయని పాత్ర. సిద్దార్థ్ అభిమానులకి అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాం.

ప్ర : ఈ సినిమా రొమాంటిక్ కామెడీ అంటున్నారు, మీరు సేఫ్ జోన్ లోనే ఉన్నారా?
స : ఈ సినిమా రొమాంటిక్ కామెడీ కాదు. ప్రేక్షకులు అలా అంచనా వేసుకుంటున్నారు. ఇది కామెడీ సినిమా, రొమాన్స్ కూడా ఉంటుంది. కామెడీ ఎక్కువగా ఉండి, రొమాన్స్ తక్కువగా ఉంటుంది.

ప్ర : కొన్ని రోజుల క్రితం మీరు థ్రిల్లర్ సినిమా చేయాలని ఉందన్నారు. ఆ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా?
స : థ్రిల్లర్ లాంటి సినిమా చేయాలని ఉంది. దర్శకురాలిగా ఒక జోనర్లో చేసిన సినిమా మళ్లీ రిపీట్ అవకుండా చూసుకుంటాను.

ప్ర : జబర్దస్త్ కి ఆలోచన ఎక్కడ ఎలా పుట్టింది?
స : అలా మొదలైంది విడుదలైన వెంటనే బెల్లంకొండ సురేష్ గారు ఒక సినిమా చేయమని అడిగారు. మొదట సమంతని కలిసాను. నిత్య మీనన్ ద్వారా సమంతని కలిసాను. సమంతకి కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది. తరువాత సిద్ధార్థ్ మా టీంలో కలిసాడు.

ప్ర : సిద్ధార్థ్, సమంత ఇద్దరు మీ ఫస్ట్ ఛాయస్ గా అనుకున్నారా?
స : సిద్ధార్థ్ కోసం ఒక రొమాంటిక్ స్టొరీ రాసుకున్నాను. జబర్దస్త్ కంటే రెండవ సినిమాగా ఇంకొకటి చేద్దామనుకున్నాను. కానీ సమంత జబర్దస్త్ స్టొరీ విన్న తరువాత తను బాగా ఎగ్జైట్ అయిపోయి ముందు ఇదే చేద్దామని పట్టుబట్టింది. సిద్ధార్థ్ అయితే బాగా చేస్తాడని ఒప్పించింది. మహేష్ బాబుకి పోకిరి లాగా నాగార్జునకి మాస్ లాగా సిద్ధార్థ్ కి ఇది కొత్త కోణంలో ఉంటుందని అనిపించింది.

ప్ర : సెన్సార్ బోర్డ్ నుండి మీ సినిమాకి కొన్ని కట్స్ పడ్డాయని తెలిసింది. అసలేం జరిగింది?
స : విశ్వరూపం వివాదం తరువాత సెన్సార్ బోర్డ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విడుదలకి ముందే కట్స్ చేస్తున్నారు. ఒక పాటలో అల్లా అల్లా అనే పదాల స్థానంలో వేరే ఏదైనా పెట్టాలని సూచించారు. ఇటీవల విడుదలైన రేస్ 2 సినిమాలో అల్లా దుహై హై అనే పాట ఉంది, ఎక్ థా టైగర్ సినిమాలో మషల్లా మషల్లా అనే పాట కూడా ఉంది. వీటి మీద ఎవరు అభ్యంతరం చెప్పలేదు. మా పాట విషయంలో మాత్రం మార్చాల్సిందే అన్నారు. సమయం కూడా తక్కువగా ఉండటంతో వాటి బదులు హల్లా గుల్లా పదాలని మార్చాం.

ప్ర : ఈ అభ్యంతరాల వల్ల భవిష్యత్తులో మీరు చేయబోయే ప్రాజెక్టుల్లో ముందే మార్పులు చేసుకుంటారా?
స : జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. సెన్సార్ బోర్డు తీసుకునే నిర్ణయాలకు విరుద్ధంగా వెళ్ళలేని పరిస్థితి. నాకు హైదరాబాదులో చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాను. వారితో ఉన్న అనుబందంతో వారితో ఫంక్షన్స్ కి వెళ్తాను. నా సినిమాలో కవ్వాలి పాట పెట్టాలనుకున్నాను. కానీ సెన్సార్ బోర్డ్ అర్ధం చేసుకోలేదు. ఇలాంటి అభ్యంతరాల వల్ల ముస్లిం లకి సంభందించిన సన్నివేశాలు లాంటివి పెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.

ప్ర : ఒక మహిళగా ఇండస్ట్రీలో వివక్ష లాంటివి ఎదుర్కొన్నారా?
స : ఇండస్ట్రీలో స్త్రీలపై వివక్ష ఉంది. ఒకవేళ లేదంటే మనని మనం మోసం చేసుకున్నట్లే. ఒకవేళ నేను అబ్బాయి అయుంటే నా అలా మొదలైంది మరో 3, 4 ఏళ్ళ ముందే వచ్చుండేది. వచ్చాక కూడా ఇంకా పెద్ద హిట్ అయి మరికొంత మంది మాట్లాడుకునే వారు.

ప్ర : మీకు ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉందా? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
స : ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికీ ఫొటోస్ తీస్తుంటాను. ఇది కాకుండా ఖాళీ సమయాల్లో మ్యూజిక్ వింటుంటాను. ఫుడ్ మీద కూడా ఆసక్తి ఎక్కువే.

ప్ర : మీ గురించి బైటి వారికీ తెలియనివి ఏమైనా ఉన్నాయా?
స : నేను చాలా బద్ధకస్తురాలిని (నవ్వుతూ). నాకు గార్ఫీల్స్ పెద్ద ఇన్స్పిరేషన్. నా ఇష్టానికి వదిలేస్తే ఒక్కో సినిమా మూడు సంవత్సరాలు తీస్తా.

ప్ర : మీరు చేయబోయే ప్రాజెక్ట్స్? వేరే భాషల్లో డైరెక్ట్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
స : పరచూరి ప్రసాద్ గారితో మూడవ సినిమా చేయబోతున్నాను. వేరే భాషల్లో అంటే హిందీలో చేయాలని ఉంది. కానీ బాలీవుడ్లో చాలా కష్టం. భవిష్యత్తులో అవకాశం ఉందేమో చూద్దాం.

ప్ర : జబర్దస్త్ నుండి కామన్ ఆడియెన్స్ ఎం ఆశించవచ్చు?
స : జబర్దస్త్ ఫుల్ కామెడీ ఫామిలీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వచ్చి నవ్వుకునే ఎంజాయ్ చేసే సినిమా.

ఫిబ్రవరి 22న విడుదల కాబోతున్న జబర్దస్త్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

 అనువాదం – అశోక్ రెడ్డి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు