ఇంటర్వ్యూ : ప్రియా ప్రకాష్ వారియర్ – తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందడం బ్లెస్సింగ్

ఇంటర్వ్యూ : ప్రియా ప్రకాష్ వారియర్ – తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందడం బ్లెస్సింగ్

Published on Feb 23, 2021 7:45 PM IST

ఒక్క కన్ను గీటుతో కుర్రకారు గుండెల్ని దోచుకున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె యూత్ స్టార్ నితిన్ చేసిన ‘చెక్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

 

*టాలీవుడ్ పరిశ్రమకు స్వాగతం

థాంక్యూ.. నేను నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘చెక్’. వింక్ మూమెంట్ తర్వాత తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘చెక్’ వచ్చింది. మరో ఆలోచన లేకుండా అంగీకరించా.

 

* కథ వినకుండానే ఓకే చెప్పేశారట నిజమేనా ?

ఎస్. ఆయన దర్శకత్వం వహించిన ‘మనమంతా’ చూశా. అది కూడ మలయాళంలో. అక్కడ ‘విస్మయం’ పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి ‘చెక్’లో నువ్వు నటించాలని అడిగారు. అందుకే హ్యాపీగా ఓకే చేశా.

 

* సినిమాలో మీ రోల్ ఏంటి ?

ఎక్కువ చెప్పలేను. ఆదిత్య ప్రేయసి యాత్ర పాత్రలో నటించాను. ఆదిత్య ప్రయాణమే ‘చెక్’. ఆ ప్రయాణంలో యాత్ర ముఖ్యమైన పార్ట్ ప్లే చేసింది. అడ్వెంచరస్ గాళ్ తరహాలో నా పాత్ర ఉంటుంది.

 

* నితిన్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?

నితిన్ చాలా సినిమాలు చేశారు. అనుభవం ఉన్న హీరో. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాను. మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే, సెట్లో అందరూ నేను కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు. ఎలాంటి తేడాలు చూపించలేదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సమానంగా చూశారు. అందుకు నితినే కూడా కారణం.

 

*నిర్మాత ఆనందప్రసాద్ గారి గురించి ?

వెరీ సపోర్టివ్. యాత్ర పాత్రలో చందూ సార్ నన్ను చూశారు. ఒకవేళ నిర్మాత ఆ పాత్రకు నన్ను వద్దని అంటే… మరో అమ్మాయిని ఎంపిక చేయాలి. చందూ సార్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాత మద్దతు ఇవ్వడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. నాపై నిర్మాత ఆనందప్రసాద్ గారు నమ్మకం ఉంచారు.

 

* చంద్రశేఖర్ యేలేటి మీరు బాగా నటించారని చెప్పారు. సెట్స్ లో మీ యాక్టింగ్ చూసి ఏమన్నారు ?

చందూ సార్ ఎక్స్‌ప్రెషన్స్ న్యూట్రల్‌గా ఉంటాయి. ఆయన సంతోషంగా ఉన్నారో, బాధలో ఉన్నారో చెప్పడం కష్టం. షూటింగ్ చేసేటప్పుడు షాట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన వైపు చూసేదాన్ని. నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. ‘సార్… నేను బాగా చేశానా? ఓకేనా?’ అని అడిగితే… ‘యా యా ఓకే’ అనేవారు. అద్భుతంగా నటించినా, సరిగా చేయకపోయినా ఆయన ఒకేలా ఉంటారు. నేను బాగా నటించానని ఆయన చెప్పడం ఎంతో సంతోషంగా ఉంది.

 

*తెలుగులో మీకిది మొదటి సినిమా. షూటింగులో ప్రాంప్టింగ్ లేకుండా డైలాగులు చెప్పారట. ముందే ప్రాక్టీస్ చేశారా ?

షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెండు రోజుల ముందు చందూ సార్, కో డైరెక్టర్లతో కొన్ని రీడింగ్ సెషన్స్లో పాల్గొన్నా. ప్రతి డైలాగ్ చదివి దాని మీనింగ్ ఏంటో అడిగి తెలుసుకున్నాను. నేను ఏం చెబుతున్నానో నాకు పూర్తిగా తెలిస్తే ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికించగలను. ప్రాంప్టింగ్ ఐడియా నాకు నచ్చదు. ఎవరో ప్రాంప్టింగ్ చెబుతుంటే యాక్టింగ్ మీద కాన్సంట్రేట్ చేయలేను. సెట్లో కూడా డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సీన్లో డైలాగులు ప్రాక్టీస్ చేశా.

 

* రెండు రోజుల్లో డైలాగులు నేర్చుకున్నారంటే మీరు ఇంటిలిజెంటే !

నవ్వుతూ… కొన్నిసార్లు డైలాగులు చదివిన తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు నాతో ఎవరైనా తెలుగులో మాట్లాడితే వాళ్లు ఏం చెబుతున్నారో అర్థం అవుతుంది. కొంచెం కొంచెం మాట్లాడగలను. తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగులో మాట్లాడతాను.

 

* తెలుగులో మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు ?

తెలుగు ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం నెక్స్ట్ లెవెల్. ‘చెక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ క్రౌడ్ అయితే క్రేజీ. ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం బ్లెస్సింగ్. ‘లవర్స్ డే’ తర్వాత రెండేళ్లుగా నేను ఏమీ చేయలేదు. రెండేళ్ల నుంచి నన్ను అభిమానిస్తూనే ఉన్నారు.

 

* ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాలు?

తెలుగులో ‘ఇష్క్’ చేస్తున్నా. కన్నడలో ‘విష్ణుప్రియ’ చేశా. అందులో ఓ పాట కూడా పాడాను. హిందీలో ‘శ్రీదేవి బంగ్లా’తో పాటు మరో సినిమాలో నటించా.

 

* చివరిగా… ‘చెక్’ సినిమా ఎలా వచ్చింది ?

ఇంకా చూడలేదు. హైదరాబాద్లో ఫ్యామిలీతో కలిసి చూడాలని అనుకున్నాను. తమ్ముడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. అందువల్ల, ఫ్యామిలీ హైదరాబాద్ రావడం కుదరడం లేదు. కొచ్చిలో కూడా ‘చెక్’ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి అక్కడే చూసేలా ప్లాన్ చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు