ఇంటర్వ్యూ : తాప్సీ – లక్ష్మీ మంచు నాటీ కో స్టార్..!

ఇంటర్వ్యూ : తాప్సీ – లక్ష్మీ మంచు నాటీ కో స్టార్..!

Published on Mar 13, 2013 1:30 AM IST

Taapsee
గత శుక్రవారం విడుదలైన ‘గుండెల్లో గోదారి’ సినిమాలో అందాల భామ తాప్సీ పాత్రకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ధనికుడైన ఓ చేపల వ్యాపారి కూతురు సరళ పాత్రలో ఆమె కనిపించింది. అలాగే ఆమె పాత్రలో కొన్ని నెగటివ్ షేడ్స్ కూడా కనపడతాయి. ఎంతో చాలెంజింగ్ గా, ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర సరళ అని తాప్సీ చెప్పింది. అలాంటి తాప్సీ తో మేము ఈ రోజు కాసేపు ముచ్చటించాము. ఆమె తన కెరీర్ విశేషాలను, లక్ష్మీ మంచు గురించి, అలాగే తన భవిష్యతు ప్రణాలికలను తెలియజేసింది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘గుండెల్లో గోదారి’ సినిమాలో మీ పాత్రకి చాలా క్రేజ్ వచ్చింది. మీరెలా ఫీల్ అవుతున్నారు?

స) నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ఆ పాత్రని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నేను భవిష్యత్తులో ఇంకా ప్రయోగాత్మక సినిమాలు గలను అనే స్పూర్తిని, నమ్మకాన్ని ఈ సినిమా నాకిచ్చింది.

ప్రశ్న) నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వేస్తున్నానని మీరేమన్నా భయపడ్డారా?

స) లేదండి.. నిజంగా అయితే కొంచెం కొత్తరకమైన పాత్రలు చేయడానికి దొరికిన సరైన అవకాశం అనుకున్నాను. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కుమార్ నాగేంద్ర నా కోసం అనుకున్న లైన్స్ ని కొంచెం మార్చాడు. అతను హీరోయిన్ పాత్రకి మరీ ఎక్కవ నెగటివ్ షేడ్ ఉంటే బాగుండదు అనుకున్నాడు కానీ నేను అతనికి మార్చవద్దని చెప్పాను. ‘ ఈ సినిమాలో నేను మంచి అమ్మాయిలా కనిపించాలనుకోవడం లేదు, అలాంటి డైలాగ్స్ కావాలని’ డైరెక్టర్ కి చెప్పాను.

ప్రశ్న) మామూలుగా మీరు రియల్ లైఫ్ లో డిఫరెంట్ గా ఉంటారు. అలాంటిది మీరు పూర్తిగా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించడం కష్టం అనిపించలేదా?

స) (నవ్వుతూ) చూడండి నాకు చాలెంజెస్ అంటే చాలా ఇష్టం. మీరన్నట్టు రియల్ లైఫ్ లోని పాత్రకి పూర్తి డిఫరెంట్ గా ఉండే ఓ పాత్రలో నటించాలంటే చాలా కష్టమైన పని కానీ అలా చేస్తేనే కదా నటిగా నాకు గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలోనూ డిఫరెంట్ గా చేసి ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్య పరుద్దామనుకుంటాను. నేను చేసిన మొదటి సినిమా ‘ఆడుకలం’ షూటింగ్ టైములో కూడా ఇలాంటి డిఫరెంట్ అనుభవానికే లోనయ్యాను, ఆ సినిమాలో నేను చేసిన పాత్రంటే నాకు చాలా ఇష్టం.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు చేపని తోమే సీన్ గురించి….

స) యాక్ … నాకు చేపలంటే ఇష్టం లేదు.. నాకు ఆ వాసన అస్సలు పడదు.. కానీ ఈ సినిమాలో నాచేత చేపని తోమించారు, మళ్ళీ నేను ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్స్ చెయ్యకూడదనుకుంటున్నాను. ఆ సీన్ తర్వాత నా చేతిని పూర్తిగా డెటాల్ వేసి కడుక్కున్నాను.

ప్రశ్న) మీ మెనూ కార్డులో నుంచి ఫిష్ ఐటెం పూర్తిగా తీసేసినట్టేనా?

స) అలా ఎం లేదండి.. నా ఫీట్ నెస్, డైట్ లో భాగంగా బాగా కాల్చిన చేపని తింటాను. కానీ అంత ఎంజాయ్ చేస్తూ తినలేను. నేను బాగా ఇష్టపడేది చికెన్. కానీ గోదావరి ఏరియాలో ‘గుండెల్లో గోదారి’ షూటింగ్ చేసేటప్పుడు లక్ష్మీ ఎంతో ఫోర్సుతో అన్ని రకాల సైజులు, అన్ని రకాల ఆకారాలు ఉన్న చేపలను వేరు వేరు స్టైల్లో వండించి నా చేత తినిపించింది.

ప్రశ్న) గోదావరి డెల్టా ఎలా ఉంది?

స) గోదావరి డెల్టా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.!! ఇలాంటి అందమైన లోకేషన్స్ ని పెట్టుకొని మనవాళ్ళు ఎందుకు ఫారిన్ లోకేషన్స్ కి వెళ్తారో నాకు తెలియడం లేదు. ఉదాహరణకి ‘జిల్లుమంది జిల్లుమంది వయసు’ పాటని పూర్తిగా గోదావరి ఏరియాలోని అంతర్వేది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాము. స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూసిన చాలా మంది ఫారిన్ లోకేషన్స్ లో తీసామని అనుకుంటున్నారు.

ప్రశ్న) చాలా మంది ఈ సినిమాలో మీ పాత్ర ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆశించారు…

స) అలా అనుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. ప్లీజ్ మీరు ఆ విషయాన్ని కుమార్ నాగేంద్రకి చెప్పండి(ముసి ముసి నవ్వులు నవ్వుతూ). నిజంగా చెప్పాలంటే లక్ష్మీ కోసమే నేను ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. ఇంకెవరన్నా ఈ సినిమా తీసి ఉంటే ఆ పాత్ర చేయడానికి నేను ఒప్పుకునేదాన్ని కాదు.

ప్రశ్న) ఎందుకలా? ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్నాయనా?

స) కాదండి.. నా పాత్ర సినిమాలో మెయిన్ పాత్ర అని మాత్రమే ఈ సినిమాని ఒప్పుకోలేదు. ఈ సినిమాలో నేను సెకండ్ హీరోయిన్ లా కనపడతాను, అలాగే నేను చాలా తక్కువగా కనపడతాను. కానీ ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. కేవలం లక్ష్మీ కోసమే ఈ సినిమా చేసాను.

ప్రశ్న) చూస్తుంటే ప్రతి విషయంలోనూ లక్ష్మీకి, మీకూ సత్సంబందాలు బాగా ఉన్నట్టున్నాయి..

స) అవును. లక్ష్మీ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆమె చాలా టెర్రిఫిక్ నటి, అలాగే సూపర్బ్ టాలెంట్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘గుండెల్లో గోదారి’ లాంటి సినిమాకి ప్రొడక్షన్ ని డీల్ చెయ్యాలంటే అంత సులువైన విషయం కాదు. అంతే కాకుండా లక్ష్మీ నాటీ కో స్టార్ కూడా, ఆమె ఫన్ తో మనల్ని చంపేస్తుంది.

ప్రశ్న) మీకు ఆదికి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆ సాంగ్ షూటింగ్ చూసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?

స) కొంచెం నెర్వస్ గా ఫీల్ అయ్యాను. ఇలాంటి సీన్స్ లో నాకు అంత కంఫర్టబుల్ గా ఉండదని, నేను ఎంతవరకూ చేయగలనో కుమార్ నాగేంద్ర కి క్లియర్ గా చెప్పాను. అతను నాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చాడు. అలాగే ” షూటింగ్ జరుగుతున్నంత సేపు మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వండి, మీరు ఎక్కడ దానికన్నా ముందు కెళ్లలేరు అనిపిస్తుందో అక్కడ ఆపేయండని’ చెప్పాడు. అలాగే నా కో స్టార్ ఆది పక్కా ప్రొఫెషనల్ మరియు సెట్స్ లో నన్ను చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యేలా చేసాడు. అతను వెరీ గుడ్ బాయ్(నవ్వుతూ)..

ప్రశ్న) షాడో సినిమా ఎలా రూపుదిద్దుకుంటోంది?

స) ఈ సినిమాలో నా లుక్ చాలా డిఫరెంట్ గా, అంతే స్టైలిష్ గా ఉంటుంది. ఈ సినిమాలో పై నుంచి కింద వరకూ నా లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా, ఇంకా చివరి సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వెంకటేష్ గారితో కలిసి పని చేసిన అనుభూతి చాలా బాగుంది. ఆయన మాట్లాడుతూ నడిచి వచ్చే ఫిల్మ్ స్కూల్ లాంటి వారు. ఫిల్మ్ మేకింగ్ లో ఆయనకు అపారమైన నాలెడ్జ్ ఉంది. ఆయన్ని చూసి తెలియని వాళ్ళు చాలా మంది ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలన్నది నేర్చుకోవచ్చు.

ప్రశ్న) మీరు బాలీవుడ్లో నటించిన సినిమా విడుదలకి సిద్దమవుతోంది? ఇప్పుడు మీ ఫోకస్ బాలీవుడ్ కి షిఫ్ట్ చేస్తున్నారా?

స) ఎప్పుడూ తెలుగు సినిమాలు వదులుకోను. ఒకవేళ బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తే తెలుగులో సినిమాలు తగ్గిస్తానేమో కానీ తెలుగు సినిమాలు చెయ్యడం మాత్రం ఆపను. బాలీవుడ్లో చెయ్యాలన్న నా డ్రీం ప్రాజెక్ట్ ని ప్రముఖ వయోకాం బ్యానర్లో, స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో దొరకడం ఫుల్ హ్యాపీగా ఉంది, ఇంతకన్నా నాకేమీ వద్దు.

ప్రశ్న) బాలీవుడ్లో పని చేయడం డిఫరెంట్ అనుభవాన్ని ఇచ్చిందా?

స) ఇక్కడ నటీనటులను దేవుళ్ళలా ట్రీట్ చేస్తారు. అలాగే నటీనటుల పట్ల ఇక్కడ ఎంతో గౌరవం, కేర్ ఉంటుంది. అదే బాలీవుడ్ ప్రొడక్షన్ యూనిట్ లోని అందరూ సమానమే. బాలీవుడ్లో హిట్ లేకపోతే మీకు సెకండ్ ఛాన్స్ దొరకదు.

ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్స్ ఏమిటి?

స) ప్రస్తుతం ‘షాడో’ సినిమా కోసం పని చేస్తున్నాను, అలాగే తెలుగులో గోపీ చంద్ – చంద్రశేఖర్ యేలేటి సినిమా చేస్తున్నాను. తమిళ్ లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్, నయనతార నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాను.

ప్రశ్న) హీరోయిన్ గా కాకుండా భవిష్యత్తులో ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా?

స) లేదండి. ఎంత కాలం వీలైతే అంతకాలం ఇక్కడ హీరోయిన్ గా కొనసాగాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు నటిగా అవకాశాలు రాకపోతే విదేశాల్లో వెళ్లి సెటిల్ అవుతాను. అక్కడ నేను చాలా సింపుల్ లైఫ్ ని గడపాలనుకుంటున్నాను. నన్ను గుర్తుబట్టని ప్రదేశంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను(నవ్వుతూ).

అంతటితో తాప్సీ ఇంటర్వ్యూని ముగించి, తన రాబోయే చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలని ఆమెకి విష్ చేసాము. మేము తాప్సీతో ముచ్చటించిన ఈ ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాము…

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు