
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగం జూలై నెలలో విడుదల కానున్న విషయం తెలిసిందే! కాగా బాహుబలి సినిమా కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం జూన్ ఒకటిన తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్‌లను విడుదల చేసి బాహుబలి ఏ రేంజ్‌లో ఉండనుందనేది సాంపిల్‌గా చూపించారు. ట్రైలర్ విడుదలైన క్షణం నుండే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ వస్తోంది. తాజాగా బాహుబలి ట్రైలర్ మరో సంచలనానికి తెరలేపింది.
విడుదలైన వారం రోజుల్లో ఈ ట్రైలర్ అన్ని చానెల్స్‌లో కలుపుకొని ఒక కోటికి పైగా వ్యూస్ సాధించింది. దీన్ని బట్టి బాహుబలి సినిమాకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారన్నది తెలిసిపోయింది. ప్రభాస్, రానాల కళ్ళు తిప్పుకోనివ్వని లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక “నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి.. నేను ఎవర్ణి?” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ‘బాహుబలి’ ఆడియో ఈ నెల్లోనే విడుదల కానుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

