‘2.0’ టీజర్, ట్రైలర్ విడుదల వాయిదా పడిందా ?

12th, November 2017 - 05:36:59 PM

దక్షిణాది సినీ ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో శంకర్, రజనీకాంత్ ల ‘2.0’ కూడా ఒకటి. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ లు కలిసి అన్ని రకాల సాంకేతిక హంగులతో సినిమాను హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని స్థాయి రూపొందిస్తున్నారు.

ఈ మధ్యే దుబాయ్ లో అంగరంగ వైభవంగా ఆడియో వేడుకను జరుపుకున్న ఈ చిత్రం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 22న హైదరాబాద్లో టీజర్ విడుదలను, డిసెంబర్ 12న చెన్నైలో ట్రైలర్ విడుదలను జరుపుకోవాల్సి ఉంది. కానీ తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ప్లాన్స్ వాయిదాపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ వాయిదాకు కారణాలు కానీ, కొత్త తేదీలు కానీ ఇంకా తెలియరాలేదు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క రిలీజ్ పట్ల కూడా ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ వెలువడలేదు.