’ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో గుర్తింపు పొందిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ తమ సరికొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించింది. ‘ఇ.ఎం.ఐ’ (EMI) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తుండగా, సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు ఆది సాయికుమార్ క్లాప్ కొట్టారు. దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు.
వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతుండగా, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ శైలజ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మధ్యతరగతి కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఈఎంఐల సమస్యలు, వాటి వల్ల తలెత్తే పరిస్థితులను భావోద్వేగాలతో పాటు వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
ఈ చిత్రానికి ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, మాధవ్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటే, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రాన్ని కూడా త్వరలోనే సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.


