ఏడుగురు మహిళల ఎమోషనల్ జర్నీ.. ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్ విడుదల!

ఏడుగురు మహిళల ఎమోషనల్ జర్నీ.. ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్ విడుదల!

Published on May 13, 2026 12:01 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర మహిళా ప్రాధ్యానత్య కలిగిన సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో పలు పీరియాడిక్, కమర్షియల్ సినిమాలు వచ్చాయి కానీ ఎమోషనల్ డ్రామాలు రావడం మాత్రం చాలా అరుదు. ఆ లోటును భర్తీ చేస్తూ, రెగ్యులర్ సింగిల్-హీరో ఫార్మాట్ కు భిన్నంగా వస్తున్న సరికొత్త చిత్రమే ‘హ్యాపీ జర్నీ’.

సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని తో పాటు యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన లాంటి ఏడుగురు మహిళల ఎమోషనల్ ప్రయాణాన్ని ఈ చిత్రం సెలబ్రేట్ చేసుకోనుంది. ఇందులో పృథ్వి దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివ తేజ పైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రూప్ డైనమిక్స్ తో పాటు ప్రతి పాత్రకూ తగిన ప్రాధాన్యత ఉండేలా చాలా లోతుగా డిజైన్ చేశారు.

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తరుణ్ రెడ్డి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ప్లెజెంట్ గా, వైబ్రెంట్ ఫీల్ గుడ్ ట్రావెల్ స్పిరిట్ తో ఆకట్టుకుంటోంది.

ఏడుగురు మహిళల ఎమోషనల్ ప్రపంచాలు, వారు కలిసి చేసే ప్రయాణం వారి జీవితాలను ఊహించని విధంగా ఎలా మార్చిందనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం అట. ప్యారిస్, మోంట్‌పెల్లియర్ వంటి అందమైన యూరోపియన్ లొకేషన్స్ లో ఈ స్టోరీ సాగినప్పటికీ.. ఇందులోని ఎమోషన్స్ మాత్రం మన నేటివిటీకి దగ్గరగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. నటీనటుల మధ్య కెమిస్ట్రీ, పెర్ఫార్మెన్స్ లు చాలా సహజంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ తో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘హ్యాపీ జర్నీ’ త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు