పి.ఎస్.జె ఫిల్మ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్న ‘ఆలోచన’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్ నటుడు మురళీమోహన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు.
స్నేహం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ప్రముఖ నటుడు సుధాకర్ కుమారుడు బెన్నీ సుధాకర్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీమోహన్.. మంచి నటీనటుల కలయికతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి టి.సురేంద్ర రెడ్డి ఛాయాగ్రహణం, వియాన్ సంగీతం అందించారు.


