‘ఇష్టంగా’ చిత్రంతో హీరోగా పరిచయమై, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ మహీ. ‘ఎంజాయ్’, ‘నువ్వు నేను ఒరేయ్ ఒసేయ్’ వంటి చిత్రాల తర్వాత, తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ సోదరుడి పాత్రలో ఆయన కనబరచిన నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.
ముఖ్యంగా హీరోతో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో అర్జున్ మహీ ప్రతిభను ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసించారు. ఈ పాత్రలో సహజత్వం కోసం ఆయన ఏకంగా 15 కిలోల బరువు పెరగడం విశేషం. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టపడటానికైనా సిద్ధమని ఈ సినిమాతో ఆయన నిరూపించుకున్నారు.
ప్రస్తుతం అర్జున్ మహీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరోగా ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయగా, అవి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. కేవలం హీరోగానే కాకుండా, కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు అర్జున్ మహీ తెలిపారు.
