భారత స్వాతంత్య్ర పోరాటంలో కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వీరుడు ఖుదీరాం బోస్. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన యువ నటుడు రాకేష్ జాగర్లమూడి తాజాగా తన సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇంతటి గొప్ప వీరుడి పాత్రలో నటించడం తన అదృష్టమని, అదే సమయంలో ఎంతో బాధ్యతగా అనిపించిందని ఆయన తెలిపారు.
ఈ చిత్రాన్ని రాకేష్ తండ్రి, దేశభక్తి గల నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మించారు. పాత్రకు న్యాయం చేసేందుకు రాకేష్ 90 రోజుల పాటు సీనియర్ నటుడు ఉత్తేజ్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తోట తరణి, మణిశర్మ వంటి దిగ్గజ సాంకేతిక నిపుణులు, వివేక్ ఓబెరాయ్, అతుల్ కులకర్ణి వంటి సీనియర్ నటులతో పనిచేయడం తనకు గొప్ప పాఠశాలలా నిలిచిందని రాకేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఉరి తీసే సన్నివేశం తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.
పార్లమెంట్‌లో ఎంపీల కోసం నిర్వహించిన స్క్రీనింగ్‌కు విశేష స్పందన లభించిందని, గోవా ఫిలిం ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ దక్కడం గర్వకారణమని రాకేష్ తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు తనకు కొండంత బలాన్నిచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం భారత ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారం ‘Waves’ (వేవ్స్)లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోందని, అందరూ చూసి ఆదరించాలని రాకేష్ కోరారు.


